రూ.21,000 కోట్ల నిధుల సమీకరణ ప్రణాళికలతో కంపెనీ మరింత వేగాన్ని అందుకుంటుందని భారతీ ఎయిర్‌టెల్ (Bharti Airtel) ఛైర్మన్ సునీల్ భారతీ మిత్తల్ అన్నారు. అదే సమయంలో 5జీ, ఫైబర్ సేవల ప్రారంభానికి; డేటా కేంద్రాల వ్యాపారాలలో పెట్టుబడులు పెంచుకోవడం ద్వారా భారీ అవకాశాలను అందిపుచ్చుకోవడానికి వీలవుతుందని ఆయన అంచనా వేశారు. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.21,000 కోట్ల వరకు నిధులను సమీకరించుకోవడానికి ఆదివారం కంపెనీ బోర్డు అంగీకారం తెలిపిన విషయం విదితమే. సోమవారం జరిగిన 'ఇన్వెస్టర్ కాల్'లో మిత్తల్ పలు విషయాలపై ఏం అన్నారంటే..
ప్రభుత్వానికిదే మా వినతి
పెట్టుబడులకు అడ్డుపడుతున్న అంశాల విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పరిశ్రమ చాలా కాలంగా కోరుతోంది. పన్నులు చాలా ఎక్కువగా ఉంటున్నాయి. ప్రతీ రూ.100 ఆదాయానికి రూ.35 వివిధ రకాల సుంకాల రూపంలోనే వెళుతోంది. మేం మా వైపు నుంచి అడుగులు వేస్తున్నాం. ప్రభుత్వం కూడా పరిశ్రమ వైపు అడుగేసి.. కొన్ని వాస్తమైన డిమాండ్లపై సానుకూలంగా స్పందించాల్సిన అవసరం ఉంది.
మరింత వృద్ధికి 'ఇంధనం'
కొత్త డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యేందుకు, తదుపరి వృద్ధి దశలోకి భారత్‌ను తీసుకెళ్లేందుకు ఎయిర్‌టెల్‌కు (Bharti Airtel) మంచి అవకాశం ఉంది. 5జీ, ఫైబర్, డేటా కేంద్రాల వ్యాపారం వంటి విభాగాల్లోకి పెట్టుబడులు పెడతాం. ఈ మూలధనం కంపెనీకి 'మరింత వృద్ధి చెందడానికి ఇంధనం'లా, 'మరో అడుగు ముందుకేయడానికి' దగ్గరలో ఉన్న అవకాశాలను ఇస్తుంది. మా పోర్ట్‌ఫోలియోల్లోని వివిధ భాగాల్లో పెట్టుబడులను(Investments) వేగవంతం చేయడానికి ఈ నిధులు ఉపయోగపడతాయి.
రూ.200 నుంచి రూ.300కు ఆర్పు
పరిశ్రమలో సగటు వినియోగదారు ఆదాయం(ఆర్పు) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా రూ.200కు; ఆ తర్వాత రూ.300కు చేరుతుందని నా అంచనా. ఆదివారం నాటి రైట్స్ ఇష్యూ ప్రకటన నేపథ్యంలో సోమవారం బీఎస్‌ఈలో(BSE Sensex) భారతీ ఎయిర్‌టెల్ షేర్లు(Bharti Airtel Share Price) 4.44% లాభంతో రూ.620.35 వద్ద ముగిశాయి. ఒక దశలో రూ.624.90 వద్ద గరిష్ఠ స్థాయిని సైతం చేరాయి.
ఇదీ చదవండి: స్టాక్ మార్కెట్లో పెట్టుబడికి ఇది సరైన సమయమేనా?