బజాజ్ బైక్‌లు అనగానే అందరికి ముందుగా గుర్తొచ్చేది పల్సర్ మోడల్. యూత్‌లో ఈ బైక్‌కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ మోడల్లో 125 సీసీ ఇంజిన్ నుంచి 220 సీసీ ఇంజిన్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ మోడల్లో హై ఎండ్ వెర్షన్‌ను తీసుకువచ్చేందుకు బజాజ్ ప్లాన్ చేస్తోంది.
ఇందులో భాగంగా తొలిసారి బజాజ్ 250 సీసీ ఇంజిన్ బైక్‌ను దీపావళికి ముందే విడుదల చేయనున్నట్లు సమాచారం. ఇంకా చెప్పాలంటే.. అక్టోబర్ 28న ఈ మోడల్‌ను ఆవిష్కరించే ఛాన్స్ ఉంది. మార్కెట్లోకి తొలి పల్సర్ మోడల్ విడుదలై 20 ఏళ్లు పూర్తవనున్న నేపథ్యంలో కంపెనీ ఈ కొత్త మోడల్‌ను విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటే ఏడాది పొడవున ఇతర మోడళ్లలో కూడా హై కెపాసిటీ బైక్‌లను విడుదల చేసేందుకు కంపెనీ కసరత్తు సమాచారం.
సరికొత్త పల్సర్ బైక్ రెండు వేరియంట్లలో.. ఎన్ఎస్ 250 ఆర్ఎస్, 250ఎఫ్ పేర్లతో అందుబాటులోకి రావచ్చని ఆటో మొబైల్ వర్గాల సమాచారం.
భారీ మార్పులు.. కొత్త ఫీచర్లు..!
ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం.. 250 సీసీ మోడల్లో బజాజ్ సమూల మార్పులు చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా గత మోడళ్లతో పోలిస్తే.. డిజైన్, సీటింగ్ హైట్, హెడ్‌లైట్ వంటివి పూర్తి భిన్నంగా ఉండనున్నట్లు సమాచారం. టైర్లు మాత్రం.. పల్సర్ ఎన్ఎస్, ఆర్ఎస్ మోడళ్లను పోలి ఉండొచ్చని తెలుస్తోంది.
పల్సర్ 250 సీసీ బైక్ రెండు వేరియంట్లలో ట్విన్ డిస్క్ బ్రేక్, టెలిస్కోప్ ఫ్రంట్ ఫోర్క్, రియర్ మోనోషాక్, డిజిటల్ ఇన్స్ట్రూమెంట్ క్లస్టర్ వంటివి ఉండొచ్చని అంచనాలున్నాయి. వీటితో పాటు.. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ, డ్యుయల్ ఛానెల్ ఏబీఎస్, రైడ్ మోడ్స్ వంటి అధునాతన ఫీచర్లను పొందుపరిచే వీలుంది.
ధర ఎంత?
మార్కెట్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న 250 సీసీ ఇంజిన్ బైక్‌లను పరిశీలిస్తే.. యమహా ఎఫ్‌జెడ్ 25 ధర రూ.1.37 లక్షల నుంచి రూ.1.41 లక్షల మధ్య ఉంది. బజాజ్లోనే డామినార్ 250 మోడల్ ధరను రూ.1.59గా ఉంది.
సుజూకీ జిక్సర్ 250 రేంజ్ ధర రూ.1.73 లక్షల నుచి రూ.1.84 లక్షలుగా ఉంది. ఈ మోడళ్లన్నింటికి పోటీ ఇచ్చే విధంగా.. బజాజ్ 250 సీసీ బైక్ ధర రూ.2 లక్షల వరకు ఉండొచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
ఇదీ చదవండి: పెట్రోల్ బంక్ లైసెన్స్‌తోనే ఈవీ ఛార్జింగ్ స్టేషన్‌కూ అనుమతి