ప్రస్తుతం కొవిడ్ మహమ్మారి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న నేపథ్యంలో వస్త్ర రంగంలో వినూత్న ఆవిష్కరణకు సన్నాహాలు చేస్తోంది ప్రముఖ టెక్స్టైల్ సంస్థ అరవింద్ లిమిటెడ్. కరోనా వైరస్‌ను అంతమొందించే యాంటీ వైరల్ దుస్తులను తయారు చేయనున్నట్లు ప్రకటించింది. త్వరలోనే వీటిని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపింది.
ఇంటెలిఫాబ్రిక్స్ పేరుతో తయారు చేస్తున్న ఈ దుస్తుల కోసం స్విస్ టెక్స్టైల్ దిగ్గజం హైక్యూతో జతకట్టనుంది అరవింద్. తైవాన్‌కు చెందిన జిన్టెక్స్ కార్పొరేషన్ సహకారం కూడా తీసుకోనుంది.
దుస్తులపై వైరస్, బాక్టీరియా రెండు రోజుల పాటు మనుగడ సాగిస్తాయని పరిశోధనలు చెబుతున్నాయి.హైక్యూ వైరోబ్లాక్ సాంకేతికతతో వైరస్‌ను అంతమొందించచ్చని అరవింద్ లిమిటెడ్ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ కులిన్ లాల్‌భాయ్ తెలిపారు. ఫలితంగా వైరస్ వ్యాప్తిని నియంత్రించవచ్చన్నారు.
" కరోనా కారణంగా ఊహించని పరిస్థితిని ప్రపంచం ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో మా వినియోగదారులకు రక్షణ కల్పించేందుకు కట్టుబడి ఉన్నాం. అందుకే హైక్యూతో భాగస్వామ్యం నెలకొల్పాం. వైరోబ్లాక్ సాంకేతికతను భారత్‌లో తొలిసారి వినియోగిస్తున్నాం. వైరస్ నుంచి రక్షణతో పాటు ఫ్యాషన్‌గా ఉండే దుస్తులను అతి త్వరలో మార్కెట్లోకి తీసుకొస్తాం "
-కులిన్ లాల్‌భాయ్, అరవింద్ లిమిటెడ్ ఎక్జిక్యూటివ్ డెరెక్టర్
హైక్యూ వైరోబ్లాక్ ప్రపంచంలోనే అత్యాధునిక యాంటి వైరల్ ఉత్పత్తులలో ఒకటి. సార్స్ కొవ్-2 వంటి వైరస్‌లను 30 నిమిషాల్లోనే 99.9శాతం నాశనం చేయగలదు.