Anil Ambani SEBI: సెక్యూరిటీ మార్కెట్లలో పాల్గొనకుండా రిలయన్స్ హోమ్ ఫైనాన్స్‌తో పాటు పారిశ్రామికవేత్త అనిల్ అంబానీ, మరో ముగ్గురిపై సెబీ నిషేధం విధించింది. ఈ కంపెనీలో మోసపూరిత కార్యకలాపాలు చేపట్టారన్నది వీరిపై ఆరోపణ. అమిత్ బప్నా, రవీంద్ర సుధాకర్, పింకేశ్ ఆర్ షాలు ఈ జాబితాలో ఉన్నారు.
'సెబీ వద్ద నమోదైన ఏ ఇంటర్మీడియరీతో కానీ, ఏ లిస్టెడ్ కంపెనీతో కానీ లేదా ఏ పబ్లిక్ కంపెనీకి చెందిన డైరెక్టర్లు/ప్రమోటర్ల నుంచి కానీ తదుపరి ఉత్తర్వులు అందేంత వరకు ఈ వ్యక్తులు నిధుల సమీకరణ చేపట్టరాదు' అని మార్కెట్ నియంత్రణాధికార సంస్థ జారీ చేసిన 100 పేజీల మధ్యంతర ఆదేశాల్లో స్పష్టం చేసింది.
ఎన్‌ఎస్‌ఈ, ఇతరులపై జరిమానా..
ఎన్‌ఎస్‌ఈతో పాటు ఆ ఎక్స్ఛేంజీ మాజీ ఎండీ, సీఈఓలు చిత్రా రామకృష్ణ, రవి నారాయణ్‌లపై సెబీ జరిమానా విధించింది. గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్, ఎండీకి సలహాదారుగా ఆనంద్ సుబ్రమణియన్ నియామకానికి సంబంధించి సెక్యూరిటీల కాంట్రాక్టు నిబంధనలు ఉల్లంఘించారని సెబీ నిర్థారించి, ఈ చర్య తీసుకుంది.
చిత్రా రామకృష్ణకు రూ.3 కోట్లు, ఎన్‌ఎస్‌ఈ, నారాయణ్, సుబ్రమణియన్‌లకు తలో రూ.2 కోట్లు, ముఖ్య నియంత్రణ అధికారిగా ఉన్న వీఆర్ నరసింహన్‌పై రూ.6 లక్షలు చొప్పున జరిమానాలు విధించింది. ఆరు నెలల పాటు కొత్త ఉత్పత్తులు తీసుకురాకుండా ఎన్‌ఎస్‌ఈపై నిషేధం విధించింది. మూడేళ్ల పాటు రామకృష్ణ, సుబ్రమణియన్‌లు మార్కెట్ సంస్థల్లో పనిచేయరాదని ఆదేశించింది.
ఇదీ చూడండి : క్రిప్టోకరెన్సీపై కొత్త ట్విస్ట్.. పన్ను వేసినా చట్టబద్ధం కాదు! బ్యాన్‌కు ఛాన్స్!