దేశంలో కరోనా విజృంభణ నేపథ్యంలో.. ఆసుపత్రుల్లో మెడికల్ ఆక్సిజన్ లేక అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొవిడ్ రోగులకు ప్రాణవాయువు అందించేందుకు కార్పొరేట్ సంస్థలు కృషి చేస్తున్నాయి. తమ ఫ్యాక్టరీలను ఆక్సిజన్ ఉత్పత్తి చేసేందుకు ఉపయోగిస్తున్నాయి.
ఉచితంగా అందిస్తూ..
- గుజరాత్‌లోని జామ్‌నగర్ ఆయిల్ రిఫైనరీస్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. తొలుత ఈ ప్లాంటు నుంచి రోజుకు 100 టన్నుల మెడికల్ ఆక్సిజన్ తయారు చేసిన రిలయన్స్.. ప్రస్తుతం 700 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తుంది. దీని సామర్థ్యం 1000 టన్నులకు పెంచనున్నట్లు పేర్కొంది. 1000 పడకల కొవిడ్ కేర్ ఆసుపత్రి ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది.
- 24 క్రయోజనిక్ కంటైనర్ల సాయంతో త్వరలో రాష్ట్రాలకు లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేయనున్నట్లు టాటా గ్రూప్స్ పేర్కొంది. 700 మెట్రిక్ టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ ఒకేసారి సరఫరా చేసేలా సన్నాహాలు చేస్తోంది.
- ఆక్సిజన్ అత్యవసరం ఉన్న ఆసుపత్రులకు 500 మెట్రిక్ టన్నుల ప్రాణవాయువు సరఫరా చేసింది జిందాల్ స్టీల్ అండ్ పవర్. తొలుత రాజస్థాన్, మధ్యప్రదేశ్, దిల్లీ, తెలంగాణ ప్రాంతాల్లోని ఆసుపత్రులకు ఆక్సిజన్ సాయం చేయనున్నట్లు వెల్లడించింది.
- తమ సంస్థకు చెందిన రిఫైనరీలలో ఆక్సిజన్ తయారు చేస్తున్నట్లు ఐఓఎల్, భారత్ పెట్రోలియమ్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) సంస్థలు తెలిపాయి. దిల్లీ, హరియాణా, పంజాబ్‌లోని ఆసుత్రులకు మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు వెల్లడించాయి. రోజుకు 150 టన్నుల మెడికల్ ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు ఐఓసీ తెలుపగా..100 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ పంపిణీ చేస్తున్నట్లు బీపీసీఎల్ తెలిపింది.
- రోజుకు 1050 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే సామర్థ్యం గల రెండు ఆక్సిజన్ ప్లాంట్లు కలిగి ఉన్నట్లు వేదాంత స్పష్టం చేసింది. ప్రస్తుతం తూతుక్కుడి స్టెర్లైట్ కాపర్ ప్లాంట్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించింది.
- ఝార్ఖండ్‌లోని బొకారో, ఛత్తీస్‌గఢ్‌లోని భిలాయ్, ఒడిశాలోని రూర్కెలా, దుర్గాపుర్, బర్న్‌పుర్ ప్లాంట్లలో ఇప్పటివరకు 35,000 టన్నుల లిక్విడ్ ఆక్సిజన్ తయారు చేసినట్లు స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా పేర్కొంది.
- ఆంధ్రప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాలకు మెడికల్ ఆక్సిజన్ సాయం చేసినట్లు రాష్ట్రీయ ఇస్పత్ నిగమ్ లిమిటెడ్ తెలిపింది. 5 యూనిట్లలో ఆక్సిజన్ తయారు చేస్తున్నట్లు పేర్కొంది. రోజుకు 550 టన్నుల అక్సిజన్ తయారు చేసే సామర్థ్యం గల మూడు ఆక్సిజన్ ప్లాంట్లు, 600 టన్నులు ఉత్పత్తి చేసే రెండు ప్లాంట్లు తమ సంస్థ వద్ద ఉన్నట్లు స్పష్టం చేసింది. మొత్తంగా రోజుకు 2600 టన్నుల గ్యాస్ ఆక్సిజన్, 100 టన్నుల ఘణపు ఆక్సిజన్ తయారు చేస్తున్నట్లు పేర్కొంది.
- 24 క్రయోజనిక్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్ట్ ట్యాంకర్లలో ఆక్సిజన్ సరఫరా చేస్తున్నట్లు ఐటీసీ లిమిటెడ్ తెలిపింది.
- రానున్న 15 రోజుల్లో రూ. 30 కోట్ల వ్యయంతో 4 ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు ఐఎఫ్ఎఫ్సీఓ తెలిపింది. ఉత్తర్‌ప్రదేశ్, గుజరాత్, ఒడిశాలో ప్లాంట్లు ఏర్పాట్లు చేయనున్నట్లు ప్రకటించింది.
- 3 పీఎస్ఏ ఆక్సిజన్ ఉత్పత్రి ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు ప్రదీప్ పాస్పేట్స్ లిమిటెడ్(పీపీఎల్) తెలిపింది. ఒడిశా ఇవి ఏర్పాటు చేయనుంది పీపీఎల్.
- 1000కి పైగా ఆక్సిజన్ సిలిండర్లు రాష్ట్రాలకు అందిస్తామని షియోమీ ప్రకటించింది. రూ. 3 కోట్లు సాయం చేస్తున్నట్లు పేర్కొంది. దిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటకకు తొలుత సహకరించనున్నట్లు పేర్కొంది. గీవ్ ఇండియా ప్లాట్‌ఫార్మ్‌తో కలిసి రూ. 1 కోటి విరాళాలు సేకరించింది షియోమీ.
ఇదీ చదవండి:కేంద్రం కొత్త రూల్స్- ఇక వాహనాలకూ నామినీ!