భారతదేశంలో అంతర్జాలం వాడకంలో చిన్నారులు దూసుకుపోతున్నారు. దేశంలో ఇంటర్నెట్ వాడుతున్న 45 కోట్ల 10 లక్షల మంది వినియోగదారుల్లో చిన్నారులే 15 శాతం ఉన్నారు. వీరంతా 5 నుంచి 11 ఏళ్లలోపు వారేనని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఏఎమ్ఏఐ) తాజాగా విడుదల చేసిన 'ఇండియా ఇంటర్నెట్ 2019' నివేదిక స్పష్టం చేస్తోంది.
నెలవారీ క్రియాశీల అంతర్జాల వినియోగదారుల పరంగా చూస్తే చైనా తరువాత స్థానంలో భారత్ ఉందని ఈ నివేదిక చెబుతోంది.
"45 కోట్ల 10 లక్షల మంది నెలవారీ క్రియాశీల వినియోగదారుల్లో... 38కోట్ల 50 లక్షల మంది 12 ఏళ్లు కంటే ఎక్కువ వయస్సు గలవారు. 6కోట్ల 60 లక్షల మంది 5 నుంచి 11 ఏళ్లలోపు చిన్నారులు. వీరంతా వారివారి కుటుంబసభ్యులకు చెందిన డివైసెస్లో అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. 2/3 వంతుల మంది ఇంటర్నెట్ వినియోగదారులు 12 నుంచి 29 ఏళ్ల లోపువారు."
- 'ఇండియా ఇంటర్నెట్ 2019' నివేదిక
అంతర్జాలం మరింత విస్తరించాల్సి ఉంది..
ప్రస్తుతం దేశంలో అంతర్జాల సేవలు 36 శాతం మాత్రమే విస్తరించాయి. మరింతగా విస్తరించడానికి చాలా అవకాశముందని నివేదిక పేర్కొంది.
పట్టణాలు, గ్రామాలకు తేడా లేదు
"దేశంలో 19 కోట్ల 20 లక్షల మంది పట్టణవాసులు అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. దాదాపు ఇదే సంఖ్యలో గ్రామీణులూ ఇంటర్నెట్ వాడుతున్నారు" అని నివేదిక స్పష్టం చేసింది. అయితే పట్టణాల్లో రోజుకు సగటున ఓ గంటపాటు అంతర్జాలం వినియోగిస్తుండగా, గ్రామీణ ప్రాంతాల్లో 15 నుంచి 30 నిమిషాలు మాత్రమే వాడుతున్నారని తెలిపింది.
ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వాడకంలో దిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. కేరళ, హరియాణా, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. నగరాల విషయానికి వస్తే ముంబయి, దిల్లీలో వరుసగా 11.7, 11.2 మిలియన్ల మంది అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. బెంగళూరు, కోల్కతా 6.1 మిలియన్ వినియోగదారులతో తృతీయ స్థానంలో ఉన్నాయి.
ఇదీ చూడండి: 'మాంద్యం ముప్పు పొంచి ఉంది.. బ్రహ్మాస్త్రమూ ఉంది'