కరోనా టీకాను ప్రపంచం నలుమూలలకు సరఫరా చేసేందుకు ఈ శతాబ్దంలోనే ముఖ్యమైన మిషన్‌ను చేప్టటేందుకు విమానయాన సంస్థలు సిద్ధమవుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద కార్గో క్యారియర్‌లలో ఒకటైన 'లుఫ్తాన్సా' విమానయాన సంస్థ... కరోనా టీకా పంపిణీకి ప్రణాళిక రచిస్తోంది. కోట్లలో ఉత్పత్తయ్యే టీకాలను అన్ని దేశాలకు అందించేందుకు సిద్ధమవుతోంది. ఫైజర్, మోడెర్నా, ఆస్ట్రాజెనెకా టీకాలను ఏప్రిల్‌లో సరఫరా చేసేందుకు లుఫ్తాన్సా ఇప్పటినుంచే పక్కా ప్రణాళిక రచిస్తోంది. జర్మనీలోని ఫ్రాంక్‌ఫర్ట్ విమానాశ్రయంలో టీకా సరఫరాకు విమానాలను సిద్ధం చేస్తోంది.
ఇదీ చదవండి: టీకా పంపిణీకి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ సిద్ధం
20 మంది సభ్యులు గల టాస్క్‌ఫోర్స్ బృందం ఎక్కువ లోడ్‌ను తీసుకెళ్లేలా విమానాలను తీర్చిదిద్దుతోంది. విమానాల్లో ఎక్కువ ఖాళీని సృష్టించి.. అధిక మోతాదులో వ్యాక్సిన్‌ను ఎలా తీసుకెళ్లాలన్నదే లుఫ్తాన్సాకు సవాల్‌గా మారింది.
టీకా అవసరాలు పెరుగుతున్నాయని, డిమాండ్‌ను బట్టి ఎయిర్ కార్గో సామర్థ్యాన్ని పెంచేందుకు యత్నిస్తున్నామని విమానయాన సంస్థలు తెలిపాయి. కరోనా టీకాను ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ అందించడం సంక్లిష్టంగా మారనుందని.. ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్(ఐఏటీఏ) సీఈఓ అలెగ్జాండర్ డీ జునియాక్ తెలిపారు.
సామర్థ్యమే అవరోధం
వ్యాక్సిన్ సరఫరాకు కార్గో విమానాల సామర్థ్యం ప్రధాన అవరోధంగా మారనుంది. ఈ అవరోధాన్ని అధిగమించి 'మిషన్ ఆఫ్ ద సెంచరీ' చేపట్టేందుకు విమానయాన సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. వచ్చే ఏడాదికి 130 కోట్ల వ్యాక్సిన్ డోసులు ఉత్పత్తి చేస్తామని ఫైజర్ ప్రకటించగా, 5 కోట్ల టీకా డోసులు సిద్ధం చేస్తామని మోడెర్నా వెల్లడించింది. తమకు 200 కోట్ల టీకా డోసుల తయారీ సామర్థ్యం ఉందని ఆస్ట్రాజెనెకా తెలిపింది.
ఇదీ చదవండి: కరోనా వ్యాక్సిన్ నిల్వకు ఆ దేశాలు సమాయత్తం!
ఇంత మోతాదులో టీకాను చాలా త్వరగా ప్రపంచ నలుమూలలకు సరఫరా చేయడం సామాన్యమైన విషయం కాదని ఎమిరేట్స్ కార్గో వైస్ ప్రెసిడెంట్ డెన్నిస్ లిస్టర్ తెలిపారు. కరోనా వ్యాక్సిన్ అందరికీ చేరాలంటే ఆయా దేశాలు ఆంక్షలను సడలించి విమాన సర్వీసులకు అనుమతి ఇవ్వాలని ఐఏటీఏ పేర్కొంది.
కోల్డ్ ప్యాక్‌లతో సిద్ధం
ఫైజర్ టీకాను మైనస్ 70 డిగ్రీల సెల్సియస్ వద్ద రవాణా చేయాల్సి ఉండడం వల్ల ఆ దిశగా విమానయాన సంస్థలు చర్యలకు ఉపక్రమిస్తున్నాయి. విమానంలో అంత చల్లటి పరిస్థితి ఉండదని, ఔషధాన్ని చల్లగా ఉంచేందుకు ఫైజర్ తయారు చేసిన ప్రత్యేక కంటైనర్లపై విమాన సంస్థలు ఆధారపడతాయని నిపుణులు తెలిపారు. ఫైజర్ టీకాను సరఫరా చేయడానికి డెల్టా ఎయిర్‌లైన్స్, అమెరికన్ ఎయిర్‌లైన్స్ సిద్ధంగా ఉన్నాయని వాల్ స్ట్రీట్ జర్నల్ స్పష్టం చేసింది. ఉష్ణోగ్రత నియంత్రిత కంటైనర్లు, కోల్డ్ ప్యాక్‌లతో విమానాలను సిద్ధం చేశారని వెల్లడించింది. ఫైజర్ వ్యాక్సిన్‌ను త్వరగా పంపిణీ చేసేందుకు అమెరికా ఇప్పటికే చార్టర్ విమానాలను నడపడం ప్రారంభించిందని వాల్ స్ట్రీట్ జర్నల్ పేర్కొంది.