Air India Hand Over To Tata: ఎయిర్ ఇండియాను టాటా గ్రూప్ సంస్థలకు అప్పగించడం ఒక నెల పాటు ఆలస్యం కానుందని అధికారులు తెలిపారు. అధికారిక ప్రక్రియ ఆశించిన దానికంటే అధిక సమయం తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ఎయిర్ఇండియాలో 100 శాతం వాటాలతో పాటు.. అనుబంధ సంస్థ ఎయిర్ఇండియా ఎక్స్‌ప్రెస్ సైతం పూర్తిగా టాటా సంస్థల పరం అయింది. అలాగే గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీ 'ఎయిర్ఇండియా శాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఐఎస్‌ఏటీఎస్)'లోనూ టాటాలకు 50 శాతం వాటాలు దక్కాయి. డిసెంబరు చివరి నాటికి రూ.2,700 కోట్లు నగదు రూపంలో కేంద్రానికి ఇచ్చేట్టుగా ఒప్పందం కుదుర్చుకున్నాయి.
కేంద్రప్రభుత్వానికి, టాటా సంస్థకు మధ్య ఉన్న అన్ని ఒప్పందాలు పూర్తికావడానికి 8వారాల సమయం పట్టనుందని ఓ సీనియర్ అధికారి తెలిపారు. 2022, జనవరి చివరినాటికి ఇవి పూర్తవుతాయన్నారు.
2021 ఆగస్టు చివరినాటికి ఎయిర్ఇండియా సంస్థకు రూ.61,562 కోట్ల రుణ భారం ఉంది. అయితే.. విజయవంతమైన బిడ్డరు రూ.15,300 కోట్లను చెల్లించాలి. మిగిలిన రూ.46,262 కోట్ల రుణభారాన్ని ఎయిర్ఇండియా అసెట్ హోల్డింగ్ (ఏఐఏహెచ్‌ఎల్)కు బదిలీ చేస్తారు. ఎయిర్ ఇండియా బిడ్‌ను టాటా గ్రూప్ దక్కించుకుంది.
ఇదీ చూడండి: గుడ్ న్యూస్.. వంట నూనెల ధరలు తగ్గాయ్.. ఏ బ్రాండ్‌పై ఎంతంటే...