Air India CEO: ఎయిర్ ఇండియాకు ముఖ్య కార్యనిర్వహణ అధికారి(సీఈఓ), మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉండాలన్న టాటా గ్రూపు ప్రతిపాదనను తాను తిరస్కరించినట్లు టర్కిష్ ఎయిర్‌లైన్స్ మాజీ ఛైర్మన్ ఇల్కర్ ఐసీ తెలిపారు. తన నియామకంపై భారత్‌లో కొన్ని వర్గాల నుంచి వ్యతిరేకత ఎదురైందని.. ఈ నేపథ్యంలోనే ఎయిర్ ఇండియా బాధ్యతలు చేపట్టలేనని ఇల్కర్ చెప్పారు.
ఎయిర్ ఇండియా సీఈఓ, ఎండీగా ఇల్కర్ ఐసీని నియమించినట్లు టాటా సన్స్ ఫిబ్రవరి 14న ప్రకటించింది. అయితే ఈ నిర్ణయంపై కొన్ని వర్గాలు అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఇల్కర్‌కు గతంలో టర్కీ రాజకీయ పార్టీలతో సంబంధం ఉన్న కారణంగా.. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఆయన నియామకాన్ని ప్రభుత్వం ఆమోదించకూడదని వారు సూచించారు. ఈ వార్తల నేపథ్యంలో ఇటీవల టాటా ఛైర్మన్ ఎన్ చంద్రశేఖర్‌తో ఇల్కర్ భేటీ అయ్యారు.
Air India New CEO
"టాటా సన్స్.. నన్ను ఎయిర్ ఇండియా సీఈఓగా ప్రకటించిన నాటి నుంచి భారతీయ మీడియాలోని కొన్ని వర్గాలను జాగ్రత్తగా గమనిస్తున్నాను. నా నియామకంపై భారత్‌లోని కొన్ని మీడియా సంస్థల్లో వ్యతిరేక వార్తలు వస్తున్నాయి. అందుకే ఎప్పుడూ వృత్తి ధర్మానికి అధిక ప్రాధాన్యమిచ్చే వ్యాపార నాయకుడిగా.. ముఖ్యంగా నా కుటుంబ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని.. నేను ఈ బాధ్యతలను అంగీకరించడం గౌరవప్రదం కాదనే నిర్ణయానికి వచ్చాను" అని ఇల్కర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని టాటా సంస్థ కూడా ధ్రువీకరించింది.
ఎయిర్ ఇండియాను నడిపించే అవకాశాన్ని తనకు ఇచ్చినందుకు టాటా సన్స్, ఆ సంస్థ ఛైర్మన్ చంద్రశేఖరన్‌కు ఇల్కర్ కృతజ్ఞతలు చెప్పారు. అయినప్పటికీ వారి(టాటా) ప్రతిపాదనను తిరస్కరించినందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
1971లో ఇస్తాంబుల్‌లో జన్మించిన ఇల్కర్ ఐసీ గతంలో టర్కిష్ ఎయిర్‌లైన్స్ ఛైర్మన్‌గా పనిచేశారు. అంతకుముందు ఆ సంస్థ బోర్డులోనూ ఉన్నారు. బిల్కెంట్ యూనివర్సిటీ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ పూర్వ విద్యార్థి అయిన ఇల్కర్.. యూకేలోని లీడ్స్ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్‌లో రీసెర్చర్‌గానూ పనిచేశారు. అలాగే, మర్మారా యూనివర్సిటీలో అంతర్జాతీయ సంబంధాలపైనా మాస్టర్స్ చేశారు. టర్కీ అధ్యక్షుడు తైపీ ఎర్డోగాన్ 1994లో ఇస్తాంబుల్ మేయర్‌గా ఉన్నప్పుడు ఆయనకు ఇల్కర్ అడ్వైజర్‌గా పనిచేశారు.
ఇదీ చూడండి: Air India CEO: ఎయిర్ ఇండియా కొత్త సీఈఓగా ఇల్కర్