దేశంలోని వేర్వేరు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న వలస కూలీలు ఇతర రాష్ట్రాలకు వెళ్లటానికి అనుమతి లేదని స్పష్టం చేసింది కేంద్ర హోంశాఖ. ఈమేరకు కొత్తగా మార్గదర్శకాలు జారీచేసింది.
ప్రస్తుతం ఉన్న రాష్ట్రంలోనే పారిశ్రామిక, తయారీ, నిర్మాణ, వ్యవసాయం, ఇతర రంగాలకు సంబంధించిన పని ప్రదేశాలకు వెళ్లేందుకు తగిన జాగ్రత్తలతో కూడిన అనుమతినివ్వాలని రాష్ట్రప్రభుత్వాలకు సూచించింది హోంశాఖ. వలస కూలీల కోసం ఏర్పాటు చేసిన క్యాంపుల్లో ఉన్న వారి వివరాలను నమోదు చేయాలని నిర్దేశించింది.
వలస కూలీలు పని ప్రదేశాలకు తరలించే సమయంలో వారికి ఆహారం, రవాణా సౌకర్యాలు కల్పించాలని సూచించింది కేంద్ర హోంశాఖ. వారు ప్రయాణించే బస్సు, ఇతర వాహనాల్లో సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోవాలని ఉత్తర్వుల్లో వెల్లడించింది. ఆ తర్వాత ఆ వాహనాలను శానిటైజ్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.