ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి రేణుకా చౌదరి జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్కు ప్రచారం కోసం వెళ్లారు. మార్కెట్లోకి వెళ్లిన కొద్దిసేపటికే కార్యకర్తలందరికీ.. మిర్చి ఘాటు తగిలింది. తుమ్ములు, దగ్గులు ప్రారంభమయ్యాయి. మిర్చిని పరిశీలిస్తున్న కాంగ్రెస్ ఫైర్ బ్రాండ్ అందుకు మినహాయింపు కాదు. విపరీతంగా తుమ్ములు, దగ్గులతో ఇబ్బంది పడ్డారు. కనీసం మాట్లాడేటప్పుడు కూడా అవస్థ తప్పలేదు. చేతిగుడ్డ అడ్డం పెట్టుకున్నా ఘాటును తట్టుకోలేకపోయారు. ఓవైపు భగ్గుమంటున్న ఎండ.. మరోవైపు మిర్చి మంట. రేణుకాతో పాటు కార్యకర్తలందరు పడ్డ కష్టం అంతా ఇంతా కాదు.
అందరికి అర్థమవుతోంది కదా ఈ ఘాటు. మరి నా మిర్చి రైతులు పడే అవస్థల గురించి మీరు ఆలోచించాలి.
----- రేణుకా చౌదరి, ఖమ్మం లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి
ఘాటు ఎక్కువగా ఉంది... వెళ్లిపోదాం మేడమ్ అని కార్యకర్తలు వారించినా వినలేదు. మిర్చి రైతుల సమస్యలు విన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. అందరూ హస్తం గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఇవీ చూడండి: ఇందూరు రైతుల పిటిషన్ విచారణ రెండువారాలకు వాయిదా