రాష్ట్ర ఆవిర్భావం అనంతరం కొత్త మండలాలు, డివిజన్లు, జిల్లాలను ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం... జోనల్ విధానంలోనూ మార్పులు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు జోన్ల స్వరూపాన్ని మార్చి అప్పటి వరకు ఏర్పాటైన 31 జిల్లాలను ఏడు జోన్లుగా విభజించింది. ఏడు జోన్లను తిరిగి రెండు మల్టీజోన్లుగా విభజించింది. జోనల్ పోస్టుల్లో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు కల్పించింది. అందుకు అనుగుణంగా కేంద్ర ఆమోదంతో రాష్ట్రపతి ఉత్తర్వులకు సవరణతో కొత్త జోనల్ విధానం అమల్లోకి వచ్చింది. అయితే శాసనసభ ఎన్నికల సమయంలో స్థానిక డిమాండ్ మేరకు నారాయణపేట, ములుగు రెండు కొత్త జిల్లాలు సహా కొన్ని డివిజన్లు, మండలాల ఏర్పాటుకు ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా రెండు కొత్త జిల్లాలు సహా పలు మండలాలు ఏర్పాటు చేశారు.
నారాయణపేట, ములుగు జిల్లాలతో పాటు కొత్త మండలాలు కూడా మనుగడలోకి వచ్చాయి. ఆయా జిల్లా, మండల పరిషత్‌లకు ఎన్నికలు కూడా జరిగాయి. వచ్చే నెలలో నూతన పాలకమండళ్లు కొలువుతీరనున్నాయి. కానీ రాష్ట్రపతి ఉత్తర్వుల్లో రాష్ట్రంలో 31 జిల్లాలు మాత్రమే ఉన్నాయి. కొత్తగా ఏర్పాటైన నారాయణపేట, ములుగు జిల్లాల పేర్లు ఇంకా అందులో చేరలేదు. పాలకమండళ్లు కూడా కొలువు తీరునున్న నేపథ్యంలో వీలైనంత త్వరగా రెండు జిల్లాలను రాష్ట్రపతి ఉత్తర్వుల్లో చేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపారు.
వీలైనంత తొందరగా చేయాలి..
జోనల్ విధానంలో ఎలాంటి మార్పులు లేకుండా కేవలం అదే జోన్ల పరిధిలో రెండు జిల్లాల పేర్లను చేర్చాలని కేంద్రాన్ని కోరింది. లోక్ సభ ఎన్నికలు కూడా పూర్తై కేంద్ర మంత్రివర్గం కూడా కొలువు తీరిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఈ కసరత్తు పూర్తయ్యేలా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. అటు వికారాబాద్ జిల్లాను జోగులాంబ జోన్లో కాకుండా చార్మినార్ జోన్లో చేర్చాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ కూడా ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశంపై కేంద్రంతో ఆమోదముద్ర వేయించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.
ఇదీ చదవండి: నూతన సచివాలయం నిర్మాణం మొదలయ్యేనా...?