సార్వత్రిక సమరం ముగిసిన వెంటనే ఎన్నికల కోడ్‌ను ఉపసంహరిస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. దాదాపు నాలుగు నెలల తర్వాత కరీంనగర్ కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి సమస్యలతో ప్రజలు పెద్ద ఎత్తున పోటెత్తారు. తమ సమస్యల పట్ల ఉన్నతాధికారులు ఓ రకంగా... కిందిస్థాయి అధికారులు మరోరకంగా స్పందిస్తున్నారని వాపోయారు.
ప్రధానంగా భూసమస్యలే...
హుజూరాబాద్ మండలం రాంపూర్‌కు చెందిన వెంకటయ్య భూమిని కబ్జా చేశారని ఫిర్యాదు చేయడానికి వెళ్తే... కనీసం పర్యవేక్షించకుండా ప్రతీసారి బయటికి తోసేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు. తన భూమిని అక్రమంగా పట్టా చేసుకున్నారని రైతుబందు పథకం డబ్బు కూడా తీసుకున్నారని వీణవంక మండలం బేతిగల్‌కు చెందిన రవిందర్ ఆరోపించారు. రేపు చూద్దాం ఎల్లుండి చూద్దామంటూ పదేళ్ల నుంచి కాళ్లరిగేలా తిప్పించుకుంటున్నారని వాపోయాడు.
దివ్యాంగులకూ తప్పట్లేదు...
మరోవైపు దివ్యాంగుల పింఛన్ల విషయంలోను అధికారుల స్పందన కరవైందని బాధితులు ఆరోపిస్తున్నారు. కనీసం నడవలేని స్థితిలో ఉండి... ఐదారు నెలలుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నా తన సమస్య మాత్రం పరిష్కారం కావడం లేదని ఓ వృద్ధురాలు కంటతడి పెట్టింది. కరీంనగర్ జిల్లాలో హిమోఫీలియా బాధితులు అధికంగా ఉన్నారని.. కనీసం అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో తాము మందుల కోసం జిల్లాలు దాటి వెళ్లాల్సి వస్తోందని బాధితులు తన బాధను విన్నవించుకున్నారు.
సమస్యలతో మారుమూల ప్రాంతాల నుంచి వచ్చే బాధితుల నుంచి కేవలం ఫిర్యాదులు స్వీకరించడమే కాకుండా... వాటిని పరిష్కరించేందుకు కూడా ప్రయత్నించాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.
ఇవీ చూడండి: మద్యానికి బానిసై... అప్పుల బాధలు బరువై!