జల వివాదాలపై చర్చించేందుకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్‌లు ఈ నెల 27న సమావేశం కావాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు సమాచారం. ఈ సమావేశం అమరావతిలో ఏర్పాటు చేయాలని అనుకొన్నా... ఎక్కడ, ఎన్ని గంటలకనేది ఇంకా ఖరారు కావాల్సి ఉందని నీటి పారుదల శాఖ ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి. ఇరు రాష్ట్రాల అధికారులు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. బ్రిజేష్‌కుమార్ ట్రైబ్యునల్, కృష్ణా, గోదావరి బోర్డులకు సంబంధించిన అంశాలపై సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. ఇద్దరు సీఎంలు ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో జల వివాదాలు పరిష్కరించుకుంటే రెండు రాష్ట్రాలూ ప్రయోజనం పొందుతాయనే అభిప్రాయంతో ఉన్నారు.
కూర్చొని మాట్లాడుకుంటే సరి...
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు బచావత్ ట్రైబ్యునల్ 811 టీఎంసీలు కేటాయించింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ 512 టీఎంసీలు, తెలంగాణ 299 టీఎంసీలు వాడుకొంటున్నాయి. పునర్విభజన సమయంలో రెండు రాష్ట్రాల్లో ఉన్న ప్రాజెక్టుల వినియోగాన్ని పరిగణనలోకి తీసుకొని ఈ లెక్కను నిర్ధారించారు. ప్రస్తుతం ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపు, తక్కువ నీటి లభ్యత ఉన్నప్పుడు వినియోగం ఎలా అన్నది ట్రైబ్యునల్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ట్రైబ్యునల్ ఎదుట వాదనలకు భారీగా ఖర్చవుతుంది. తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ రెండున్నర రెట్లు ఎక్కువగా ఖర్చు చేసింది. బచావత్ ట్రైబ్యునల్‌లోనే అన్యాయం జరిగిందని... సవరించాలని కోరుతూ సుప్రీంకోర్టులో కేసు వేసింది తెలంగాణ. వీటన్నింటిపై చర్చించుకొని రెండు రాష్ట్రాలు ఓ అంగీకారానికి వచ్చి విషయాన్ని రాతపూర్వకంగా తెలియజేస్తే అదే ట్రైబ్యునల్ తీర్పులోనూ వచ్చే అవకాశం ఉంది. కృష్ణా, గోదావరి బోర్డుల పనితీరు, అసలు ఈ బోర్డుల అవసరం ఉందా అనే అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఇవీ చూడండి: పెళ్లైన రెండో రోజే... పందిట్లో నలుగురు మృతి