లోక్‌సభ ఎన్నికల్లో ప్రణాళికాబద్ధంగా ముందుకెళ్లి ఉంటే మరింత మెరుగైన ఫలితాలు వచ్చేవని హస్తంపార్టీ అంతర్మథనం చెందుతోంది. మూడు లోక్‌సభ స్థానాల్లో నెగ్గినా కీలక స్థానాల్లో పట్టుకోల్పోవడం, భాజపా, తెరాస ఆధిపత్యం పెరగడం వంటి అంశాలపై కలవరం చెందుతోంది. కొన్ని స్థానాల్లో మరింత ప్రయత్నం చేసి ఉంటే మరో రెండు స్థానాలైనా దక్కేవన్న భావన ఆ పార్టీ నేతల్లో ఉంది.
కాస్త చేయందిస్తే గెలిచేవారే..
మొదటి నుంచి గెలుపు ఖాయమనుకున్న జహీరాబాద్, చేవెళ్ల స్థానాల్లో ఓటమి అధిష్ఠానంలో కలవరం రేపింది. ఈ రెండు స్థానాల్లోను స్పల్పతేడాతో ఓడిపోవడం పార్టీ శ్రేణుల్లో నిరాశ కలిగించింది. జహీరాబాద్ స్థానం 6,229 ఓట్ల తేడాతో సమీప అభ్యర్థి మదన్ మోహన్‌రావు ఓటమిపాలవ్వగా, కొండా విశ్వేశ్వర రెడ్డి చేవెళ్లలో 14,772 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
కాంగ్రెస్‌పార్టీ గెలుపొందిన మూడుస్థానాలతో పాటు జహీరాబాద్, చేవెళ్ల, పెద్దపల్లి, ఆదిలాబాద్ నియోజకవర్గాల్లోను గణనీయమైన ఓట్లు సాధించింది. ఆదిలాబాద్, పెద్దపల్లి నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారిస్తే పార్టీకి సానుకూల ఫలితాలొచ్చేవని హస్తం నేతలు విశ్లేషిస్తున్నారు.
పట్టు నిలుపుకోవాలి
ఖమ్మం, మహబూబాబాద్ స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో మెరుగైన ఫలితాలు సాధించిన కాంగ్రెస్ తర్వాత జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ప్రభావం చూపలేకపోయింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలకు తెరాస మద్దతు పలకడమే ఇందుకు కారణమని కాంగ్రెస్ భావిస్తోంది. మరోవైపు బలమైన పునాది లేకపోయినా భాజపా నాలుగు స్థానాలు కైవసం చేసుకోవడం హస్తంపార్టీని కలవరపెడుతోంది. భాజపా గెలుపొందిన స్థానాల్లో తమ కేడర్‌ను బలపర్చుకోవడానకి కాంగ్రెస్ నేతలు కృషిచేయాల్సి ఉంది. ఫలితాల విశ్లేషణతో పాటు భాజపా బలపడుతున్న స్థానాలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ నేతలు నిర్ణయించారు. ఈ మేరకు ఇవాళ గాంధీభవన్‌లో కీలక సమావేశం జరగనుంది.