ఎమ్మెల్సీ ఉప ఎన్నికలపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని హస్తం పార్టీ నేతలు నిర్ణయించారు. ఓటర్ల జాబితా సిద్ధం కాకముందే ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వడంపై సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ వేయనున్నారు. ఈ అంశంపై పార్టీ నేతలతో గాంధీ భవన్ ఏర్పాటు చేసిన సమావేశంలో చర్చించారు. సమావేశంలో స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల కమిషన్ వ్యవరిస్తున్నతీరు, ఇంతర అంశాలపై సమాలోచనలు చేశారు.
ఓటర్ల జాబితాలో స్పష్టత ఇవ్వకుండా ఎన్నికలు ఎలా..?
ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓటర్ల జాబితాలో స్పష్టత ఇవ్వలేదని నేతలు ఆరోపించారు. రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్‌కుమార్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆరోపించారు. ఖాళీ అయిన ఎమ్మెల్సీ స్థానాల్లో ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించాలన్న నిబంధన లేదన్నారు.
ఓ వైపు న్యాయపోరాటం చేస్తూనే బలమైన అభ్యర్థులను ఎంపిక చేయాలని పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపిక బాధ్యత ఆయా డీసీసీలకు అప్పగించామని ఉత్తమ్ పేర్కొన్నారు. సమావేశంలో ఆర్సీ కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, వి.హనుమంతరావు, పొన్నాల, ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి, మాజీ మంత్రులు జానారెడ్డి, షబ్బీర్ అలీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు.
ఇదీ చదవండి: ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదావేయాలి: ఉత్తమ్ లేఖ