బ్యాలెట్ ద్వారా పోలింగ్‌కు కసరత్తు
ఇప్పటికే ఈ విషయమై నిజామాబాద్ కలెక్టర్‌తో ఎన్నికల అధికారులు చర్చించారు. బ్యాలెట్ ద్వారా పోలింగ్ నిర్వహించేందుకు అవసరమైన చర్యలు ప్రారంభించాలని సూచించారు. ఇందులో భాగంగా బ్యాలెట్ బాక్సులపై దృష్టి సారించారు. బ్యాలెట్ పత్రాలు సిద్ధం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు... ముద్రణకు అవసరమైన కాగితాన్ని సేకరించే పనిలో పడ్డారు అధికారులు. బ్యాలెట్ పత్రాల ముద్రణ కోసం ప్రభుత్వ ముద్రణాలయంతో పాటు ప్రఖ్యాత ప్రైవేట్ ముద్రణాలయాలతో కూడా చర్చిస్తున్నారు. నిర్ణీత గడువులోగా ముద్రించి ఇవ్వగలరా లేదా అన్న విషయమై సంప్రదింపులు చేస్తున్నారు.
పోలింగ్ తేదీ నాటికి అవసరమైన బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఇతర సామగ్రి సిద్ధమవుతుందా లేదా అని చర్చిస్తున్నారు. ఎక్కువ సమయం పడితే పోలింగ్ తేదీని పొడిగించవచ్చని అంటున్నారు. ఈ నెల 28న ఉపసంహరణ గడువు అనంతరం అభ్యర్థుల తుదిజాబితా ఖరారయ్యాకే అధికారులు దృష్టి సారించనున్నారు.
గుర్తుల కేటాయింపులో ఇబ్బందులు లేవు
అన్ని అంశాలను కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించి ఈసీ ఆదేశాలకు అనుగుణంగా పోలింగ్ నిర్వహించనున్నారు. అభ్యర్థులకు గుర్తుల కేటాయింపులో ఎలాంటి సమస్య లేదని అధికారులు చెప్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన 199 ఫ్రీ సింబల్స్ నుంచి స్వతంత్రులకు గుర్తులు కేటాయించవచ్చు. మన రాష్ట్రానికి సంబంధించి ఈ జాబితా నుంచి ఆటో, టోపీ, రోడ్ రోలర్ లాంటి గుర్తులను తొలగించారు. ఎంత మంది అభ్యర్థులు ఉన్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడం ఇబ్బంది కాబోదని... సాఫీగా పోలింగ్ నిర్వహిస్తామని అధికారులు చెప్తున్నారు.
ఇదీ చదవండిఃతెరాసది సీట్ల రాజకీయం: సోయం బాపురావు