YSRTP Chief YS Sharmila Comments: కాంగ్రెస్‌తో కలిసి నడవడానికి సిద్ధంగా ఉన్నానని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల స్పష్టం చేశారు. ఈ మేరకు రేపు దిల్లీలో కాంగ్రెస్ అధిష్ఠానాన్ని కలుస్తానని తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్‌తో కలిసి నడవాలనే పోటీ పెట్టలేదన్నారు. తమ మద్దతుతోనే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.
తాము పోటీ పెట్టనందునే తెలంగాణలో 31 చోట్ల కాంగ్రెస్ గెలిచిందని, కేసీఆర్ అరాచక పాలనను అంతమొందించేందుకు తన వంతు కృషి చేశానని షర్మిల తెలిపారు. మరో రెండు రోజుల్లో పూర్తి విషయాలు తెలియజేసి, అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్తానని అన్నారు. కుమారుడు రాజారెడ్డి, కాబోయే కోడలు ప్రియా అట్లూరితో కలిసి వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయలోని వైఎస్సార్ సమాధి వద్ద షర్మిల నివాళులర్పించారు.
షర్మిలను కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలిగా నియమిస్తారనే ప్రచారం నేపథ్యంలో బుధవారం దిల్లీ వెళ్తున్నట్లు చెప్పారు. తన కుమారుడి వివాహం సందర్భంగా తండ్రి ఆశీస్సులు తీసుకోవడానికి వచ్చినట్లు షర్మిల పేర్కొన్నారు. కుమారుడు రాజారెడ్డి వివాహ ఆహ్వాన పత్రిక వైఎస్ ఘాట్ వద్ద ఉంచారు. వైఎస్ విజయమ్మ సైతం వారి వెంట ఉన్నారు. వైఎస్ ఘాట్ వద్ద షర్మిల, విజయమ్మ ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
రేపు దిల్లీకి వైఎస్ షర్మిల - ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక!
YS Sharmila Joining Congress: ఈ రోజు ఉదయం వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీ ముఖ్య నేతలతో అధ్యక్షురాలు షర్మిల అత్యవసర భేటీ నిర్వహించారు. పార్టీ విలీనం, భవిష్యత్ కార్యాచరణపై ముఖ్య నేతలతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా మరిన్ని విషయాల గురించి ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానని షర్మిల స్పష్టం చేశారు.
షర్మిల హస్తం పార్టీలో చేరనున్నారనే ఊహాగానాల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యం ఏర్పడింది. ఈ క్రమంలోనే పార్టీ విలీనంపై నేడు షర్మిల కీలక ప్రకటన చేసే అవకాశం ఉందని అంతా భావించినా అలాంటిదేమీ జరగలేదు. తనతో కలిసి నడుస్తానన్న ఎమ్మెల్యే ఆర్కేకు షర్మిల ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు షర్మిలకు ఏఐసీసీలో కీలక పదవి దక్కే అవకాశం ఉందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శి తూడి దేవేందర్ రెడ్డి అన్నారు. షర్మిల ఎల్లుండి కాంగ్రెస్ పార్టీలో చేరతారని తెలిపారు. పార్టీ నేతలకూ కీలక పోస్టులు వస్తాయని షర్మిల హామీ ఇచ్చినట్లు దేవేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
నారా లోకేశ్‌కు క్రిస్మస్ కానుక పంపిన షర్మిల - కృతజ్ఞతలు తెలుపుతూ ట్వీట్
YV Subba Reddy Comments on YS Sharmila: షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరితే తమకేం నష్టం లేదని వైసీపీ ఉత్తరాంధ్ర సమన్వయకర్త వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విజయమ్మతో భేటీలో కుటుంబ విషయాలే చర్చిస్తున్నానని, రాయబారాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. జగన్‌ను ఎదుర్కొనే ధైర్యం లేకనే బురద జల్లుతున్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా వైసీపీ గెలుపును ఆపలేరని చెప్పారు. క్షేత్రస్థాయిలో అభ్యర్థులపై వ్యతిరేకత, గెలుపు అవకాశాలు తక్కువ ఉన్న చోటే మార్పులు - చేర్పులు చేస్తున్నట్లు వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.
తాడేపల్లికి షర్మిల: బుధవారం సీఎం జగన్‌ను వైఎస్ షర్మిల కలవనున్నారు. రేపు సాయంత్రం 4గంటలకు షర్మిల తాడేపల్లి వెళ్లి కుమారుడి వివాహ ఆహ్వాన పత్రికను జగన్‌కు అందజేయనున్నారు. సీఎం జగన్‌ను కలిసిన తర్వాత షర్మిల అక్కడి నుంచే దిల్లీకి వెళ్లనున్నారు. ప్రస్తుతం షర్మిల కుటుంబ సభ్యులు ఇడుపులపాయలో బస చేశారు.