21ఏళ్లకే కేరళ కాంగ్రెస్‌లో సభ్యత్వం.. ఆ తర్వాత అలప్పుజ జిల్లా పంచాయతీ సభ్యురాలిగా బాధ్యతలు.. ఇక ఇప్పుడు పిన్నవయస్సులోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ.. ఇదీ 26ఏళ్ల అరితా బాబు ప్రస్థానం. శాసనసభ ఎన్నికల్లో కాయంకుళం నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఆమె.. సొంత ప్రజలే తనను గెలిపిస్తారని ధీమాగా ఉన్నారు.
"కాంగ్రెస్.. 21ఏళ్ల వయసులోనే నాకు అవకాశమిచ్చింది. నాడు.. నన్ను జిల్లా పంచాయతీ సభ్యురాలిగా ఎంపికచేసింది. ఇప్పుడు 26ఏళ్ల వయసులో శాసనసభ అభ్యర్థిగా మరో అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో 100శాతం విజయం నాదే. ఎందుకంటే.. ఇది నా సొంత నియోజకవర్గం. వీళ్లు నా ప్రజలు. నన్ను అభ్యర్థిగానే కాకుండా.. కూతురిగానూ ఆదరిస్తారు."
- అరితాబాబు, కాంగ్రెస్ అభ్యర్థి
పాలమ్మి కుటుంబాన్ని పోషిస్తూ..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో బరిలోకి దిగిన కాంగ్రెస్ అభ్యర్థుల్లో.. పిన్న వయస్కురాలైన అరిత పేరు ప్రత్యేకంగా ప్రకటించారు కేరళ పీసీసీ చీఫ్ ముల్లప్పల్లి రామచంద్రన్. ఆమెకున్న ప్రత్యేక లక్షణాలే ఆమెను ఈ స్థాయికి చేర్చాయని ప్రశంసించారు.
ఆర్థికపరంగా అట్టడుగు వర్గానికి చెందిన అరిత.. ఆవులను మేపుతూ, వాటి ద్వారా వచ్చే పాలు అమ్మి కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇంతటి పేదరికంలోనూ వాణిజ్య విభాగంలో గ్రాడ్యుయేషన్ చేశారామె. ఇప్పుడు సోషల్ వర్క్‌లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.
కేరళ స్టూడెంట్స్ యూనియన్ ద్వారా రాజకీయాల్లోకి అడుగుపెట్టారు ఆమె.
ఆమె కోసం ప్రియాంక ఎదురుచూపులు..
అరితను కలిసేందుకు ప్రియాంకా గాంధీ వాద్రా.. మంగళవారం కాయంకుళంకు వెళ్లారు. ఆ సమయంలో అరిత ప్రచారానికి వెళ్లారు. ఫలితంగా.. అరిత కోసం ప్రియాంక ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత ఇరువురూ కలిసి రోడ్‌షోలో పాల్గొన్నారు.
'ఉపాధి హక్కు చట్టం తెస్తాం'
రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు అరిత. ప్రభుత్వ కొలువులు లేకపోయినా.. అధిక శాతం పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) వైపే మొగ్గుచూపుతున్నారని పేర్కొన్నారు. కానీ, రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి కనబర్చరని చెప్పారు. మహిళా సాధికారత కోసం తాను మరింత కృషి చేస్తానని... యూడీఎఫ్ అధికారంలోకి వస్తే.. పీఎస్సీకి ఎంపికైన అభ్యర్థులకు ఉపాధి హక్కు కల్పించే చట్టాన్ని రూపొందిస్తుందని హామీ ఇచ్చారు.
కాయంకుళం స్థానంలో అరితకు పోటీగా.. సీపీఎం సిట్టింగ్ ఎమ్మెల్యే ప్రతిభా హరి, ఎన్డీఏ తరఫున ప్రదీప్లాల్ బరిలో ఉన్నారు. ప్రతిభా హరి గత ఎన్నికల్లో.. కాంగ్రెస్ అభ్యర్థి(ఎన్ లిజు)పై 11వేల మెజారిటీతో విజయం సాధించారు.
కేరళలోని మొత్తం 140 స్థానాల్లో ఏప్రిల్ 6న ఎన్నికలు జరగనున్నాయి. మే 2న ఫలితాలు వెల్లడిస్తారు.
ఇదీ చదవండి: 25 ఏళ్ల తరువాత ఆ పార్టీ నుంచి మహిళా అభ్యర్థి