కోబ్రా గుడ్లకు కృత్రిమంగా వేడిని అందించి.. కోబ్రా పిల్లలకు ఆయువు పోశాడు కర్ణాటక దక్షిణ కన్నడ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి. పక్షులు, జంతువులపై ఉన్న మక్కువతో ఇప్పటివరకు వేలాది కోబ్రాలను రక్షించినట్లు చెబుతున్నాడు.
ఇదీ జరిగింది...
పుత్తూరుకు చెందిన తేజస్ అనే వ్యక్తి ఇటీవలే ఓ డాక్టర్ ఇంట్లో దొరికిన 8 కోబ్రా గుడ్లను తన సొంతింటికి తీసుకెళ్లాడు. అటవీ శాఖ అధికారుల అనుమతితో ఆ గుడ్లకు కృత్రిమంగా వేడిని అందించే ఏర్పాట్లు చేశాడు. 57 రోజుల తర్వాత గుడ్ల నుంచి కోబ్రా పిల్లలు బయటకు వచ్చాయి.
అనంతరం కోబ్రా పిల్లలను వెంటనే అడవిలో వదిలేశాడు తేజస్. కళాశాలలో చదువుతున్న రోజుల్లోనే ఎన్నో పాములను రక్షించినట్లు తెలిపాడు. విషపూరిత పాములను కూడా అలవోకగా పట్టుకుని వాటిని అడవిలో వదిలేస్తున్నట్లు పేర్కొన్నాడు. ఇలా పాములను రక్షించే క్రమంలో కొన్ని సర్పాలు తనను కాటు వేశాయని తెలిపాడు. అయినప్పటికీ జంతువులపై, పక్షులపై ఉన్న ప్రేమతో పాములను రక్షిస్తున్నట్లు వివరించాడు. ఇప్పటివరకు దాదాపు 5 వేల కోబ్రాలను రక్షించానన్నాడు తేజస్.