World Dwarf Games Germany : సాధించాలనే తపన ఉంటే ఏదైనా సుసాధ్యమే అంటోంది కర్ణాటకలోని బెళగావి జిల్లాకు చెందిన ఓ మరుగుజ్జు యువతి. వడ్డీకి రూ. లక్షలు అప్పు తీసుకుని జర్మనీలో జరిగిన వరల్డ్ డ్వార్ఫ్ గేమ్స్ (ప్రత్యేకంగా మరుగుజ్జుల కోసం నిర్వహించే పోటీలు)లో పాల్గొంది. తన ప్రతిభతో మూడు పతకాలు సాధించి అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది. ఆమె విజయ గాథ ఇదే.
బెళగావి జిల్లాలోని గోకాక్ మండలం చిక్కనంది గ్రామానికి చెందిన మంజుల శివానంద గోరుగుడ్డి ఓ మరుగుజ్జు. క్రీడలపై మక్కువ ఉన్న మంజుల.. షాట్‌పుట్, వీల్ త్రో, జావెలిన్ త్రో లాంటి ఆటల్లో ప్రావీణ్యం సాధించింది. పలు రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లోనూ మెరిసి పతకాలు సాధించింది. ఈ క్రమంలో మంజులకు జూలై 28 నుంచి ఆగస్టు 4 వరకు జర్మనీలో జరిగిన వరల్డ్ డ్వార్ఫ్ గేమ్స్‌లో పాల్గొనేందుకు అవకాశం లభించింది.
అయితే, అంత దూరం వెళ్లేందుకు ఆమె వద్ద డబ్బులు లేవు. కానీ ఎలాగైనా వెళ్లాలని నిర్ణయించుకున్న మంజుల.. తెలిసిన వాళ్ల దగ్గర వడ్డీకి రూ. 2.5 లక్షలు అప్పుతీసుకుని జర్మనీ వెళ్లింది. ప్రపంచ డ్వార్ఫ్ గేమ్స్ షాట్పుల్లో బంగారు పతకం, వీల్ త్రోలో రజతం, జావెలిన్ త్రోలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని కైవసం చేసుకుంది. భారతదేశం పేరును ప్రపంచ వేదికపై మారుమోగించింది. మరో మూడు రోజుల్లో స్వదేశానికి చేరుకోనున్న మంజుల.. వీడియో సందేశం ద్వారా తన ఆనందాన్ని పంచుకుంది. 'నేను 8వ ప్రపంచ మరుగుజ్జు క్రీడల్లో పాల్గొని మూడు పతకాలు సాధించాను. ఈ విజయాన్ని నా తల్లికి, నా మాతృభూమికి అంకితం చేస్తున్నాను. మరిన్ని విజయాలు సాధించేందుకు ఈ విజయం నన్ను ప్రోత్సహించింది. నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు' అని వీడియోలో మంజుల చెప్పింది.
తాను మూడేళ్లుగా వివిధ క్రీడా పోటీల్లో పాల్గొంటున్నానని మంజుల తెలిపింది. ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో 2, రాష్ట్ర స్థాయిలో 3 బంగారు పతకాలు సాధించానని పేర్కొంది. ఇప్పుడు జర్మనీ వెళ్లడం చాలా సంతోషంగా ఉందని.. కానీ అందుకోసం తాను అప్పు తీసుకున్నట్టు చెప్పింది. కొంతమంది దాతలు వారికి తోచినంతగా నాకు సహాయం చేశారని చెప్పిన మంజుల.. వారికి ధన్యవాదాలు తెలిపింది.