గర్భంతో కొనసాగాలా లేదా అనే స్త్రీ హక్కును హరించలేమని వ్యాఖ్యానించింది కేరళ హైకోర్టు. పుట్టబోయే శిశువుకు వికాలాంగుడిగా మారే ప్రమాదం పొంచి ఉంటే అబార్షన్ చేసుకునే స్వేచ్ఛ తల్లికి ఉంటుందని, దానిని కోర్టులు గుర్తిస్తాయని చెప్పింది. ఈ మేరకు మానసిక వైకల్యంతో బాధపడుతున్న ఓ గర్భిణీకి.. అసాధారణ వ్యాధితో పుట్టబోయే 22 వారాల పిండాన్ని తొలగించేందుకు అనుమతించింది.
కేరళకు చెందిన సదరు మహిళకు పుట్టబోయే శిశువు.. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అనే వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యులు నిర్ధరించారు. అంటే అదనపు ఎక్స్ క్రోమోజోమ్తో బిడ్డ జన్మిస్తుంది. దీనివల్ల పుట్టాక.. శిశువులో మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదముంది.
నివేదికల ప్రకారం తల్లికి మానసిక వైకల్యం సహా దృష్టి లోపం, మూర్చ, కండరాల బలహీనత వంటి సమస్యలున్నాయి. అయితే క్లైన్ఫెల్టర్ ప్రాణాంతకం కానప్పటికీ వికలాంగ శిశువును పెంచే క్రమంలో ఆమె ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ మేరకు తీర్పు చెప్పింది.
ఇదీ చూడండి: గర్భిణులకు కొవిడ్ సోకితే ముందే ప్రసవం!