Woman Post Mortem Assistant : మార్చురీ పేరు వింటేనే చాలా మంది భయపడతారు. కానీ మంజూదేవీ అనే మహిళ మాత్రం సుదీర్ఘ కాలంగా ఈ వృత్తిలో రాణిస్తోంది. తన అత్త, భర్త వారసత్వంగా పనిలో చేరిన ఆమె.. ధైర్యంగా 23 ఏళ్లుగా ఆ వృత్తిలో కొనసాగుతోంది. రెండు దశాబ్దాలకు పైగా పోస్టుమార్టం సహాయకురాలిగా పనిచేస్తూ.. ఇప్పటివరకు 20వేలకు పైగా శవపరీక్షలు చేసింది. తన బంధువుల మృతదేహాలకు కూడా పోస్టుమార్టం చేసి తన వృత్తిలో భాగం అంటోంది. అటు ఉద్యోగాన్ని, ఇటు కుటంబాన్ని బ్యాలెన్స్ చేస్తూ మహిళలకు ఆదర్శంగా నిలుస్తోంది. మహిళలు తలచుకుంటే ప్రతి యుద్ధంలో గెలుస్తారని.. ధైర్యంగా ముందడుగేస్తే ప్రపంచ వారిని ఆపగలదా! అంటోంది. నిజమైన మహిళా సాధికారతకు నిదర్శణంగా నిలిచింది బిహార్ సమస్తీపుర్కు చెందిన 48 ఏళ్ల మంజూదేవీ.. తన విజయ ప్రస్థానాన్ని వివరించింది.
20 వేల మృతదేహాల పోస్టుమార్టం కథ.. మంజూదేవీ మాటల్లో..
- ఎప్పటినుంచి పోస్టు మార్టం చేస్తున్నారు?
నేను 2000వ సంవత్సరం నుంచి పోస్టుమార్టం సహాయకురాలిగా పనిచేస్తున్నాను. మృతదేహాన్ని క్షుణ్ణంగా పరిశీలించి.. కోయడమే నా పని. వైద్యులు సూచించిన విధంగా.. మృతదేహం శరీరభాగాలు కత్తిరించి.. మళ్లీ వాటికి కుట్లు వేస్తాను. - మీరు మొదటిసారి పోస్టుమార్టం చేసినప్పుడు అనుభవం ఎలా ఉంది?
అప్పట్లో నా అత్త, భర్త పోస్టు మార్టం చేసేవారు. ఆరోజు వారు పని నిమిత్తం వేరే ప్రాంతానికి వెళ్లారు. దీంతో పోస్టుమార్టం సహాయకురాలిగా నేను వెళ్లాల్సివచ్చింది. మొదటి మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తున్నప్పుడు నేను అసౌకర్యానికి గురయ్యాను. ప్రతిదీ వింతగా అనిపించింది. కానీ డాక్టర్ ఇచ్చిన ధైర్యంతో మొదటిసారి ఈ పనిని పూర్తి చేశాను. - ఈ పనిలో పెద్ద సమస్య ఎప్పుడు ఎదురవుతుంది?
మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం వచ్చినప్పుడు.. మృతుల కుటుంబ సభ్యులు చాలా బాధలో కోపంగా ఉంటారు. ఆ సమయంలో వారికి అర్థమయ్యేలా చెప్పి.. త్వరగా పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని వారికి అప్పగించడం అతిపెద్ద సమస్య.
- పోస్టుమార్టం చేసిన తర్వాత మీ మానసిక స్థితి ఎలా ఉంటుంది? మీకు అంత ధైర్యం ఎలా వస్తుంది?
ఈ పని చేసి చేసి అలవాటుగా మారింది. ఇప్పుడు ఈ పనిలో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు. - మీ కుటుంబం దాదాపు నాలుగైదు తరాలుగా పోస్టుమార్టం చేసే ఈ వృత్తిలో ఉంది. దాని గురించి చెప్పండి?
దాదాపు 5 తరాలుగా మా కుటుంబం ఈ పని చేస్తోంది. మా మామయ్య, అమ్మమ్మ ఇక్కడ పోస్టుమార్టం చేసేవాళ్లు. ఆ తర్వాత వాళ్ల అమ్మ, అనంతరం మా మామ ఈ పని చేసి అనారోగ్యంతో చనిపోయారు. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు బలవంతంగా నేను ఈ వృత్తిలో చేరాను. - మీరు పోస్టుమార్టం చేస్తున్నందుకు వివక్షకు ఎప్పుడైనా గురయ్యారా?
నాపై సమాజం, చుట్టుపక్కల వాళ్ల అభిప్రాయం బాగోలేదు. కానీ నేను ఎప్పుడూ దాని గురించి ఆలోచించలేదు. నా పిల్లలను నేను పెంచాలి కాబట్టి.. వాటన్నింటినీ పట్టించుకోకుండా నా పనిపై మాత్రమే దృష్టి పెట్టాను. - మీరు ఎప్పుడైనా మీ బంధువు పోస్ట్‌మార్టం చేశారా? ఆ సమయంలో మీకు ఎలా అనిపించింది?
నా బంధువులను చూసి నేను బాధపడ్డాను. కానీ ఇది నేను రోజూ చేసే పని. అందుకే నా బంధువులైన వారి పోస్ట్‌మార్టం కూడా చేశాను.
- చాలా మంది మార్చురీ పేరు వినగానే భయపడిపోతారు. మీరు పోస్టుమార్టం చేసేటప్పుడు భయపడతారా?
నాకు ఇప్పుడు భయం లేదు. ఇంతకు ముందు కూడా భయపడలేదు. - రోజుకు ఎంత సంపాదిస్తారు?
ఇంతకుముందు నాకు ఒక మృతదేహానికి పోస్ట్‌మార్టం చేస్తే రూ.110 రూపాయలు వచ్చేవి. 2019 నుంచి రూ.380 చొప్పున లభిస్తోంది. - పోస్టుమార్టంలో మరణానికి కారణం ఎలా తెలుస్తుంది?
వ్యక్తి మరణానికి ప్రమాదం లేదా మరేదైనా కారణం కావచ్చు. దీనిని అంచనా వేయడానికి అనేక పద్ధతులు ఉన్నాయి. అయితే, ప్రమాదం జరిగిన తర్వాత మెదడు, ఛాతీ, పొట్ట తదితర భాగాలకు గాయాలు కావడం, రక్తం గడ్డకట్టడం, చెవుల నుంచి రక్తం కారడం జరుగుతుంది. ఇవి అనేక విషయాలను సూచిస్తాయి. - మీరు రోజూ పోస్ట్ మార్టం గదికి వెళ్తారు. ఆ గది ఎలా ఉంటుంది? మీరు ఎప్పుడైనా ఏడ్చారా?
ఏ సందర్భమైనా నా కళ్లలోంచి నీళ్లురాలేదు. బహుశా నా కన్నీళ్లు ఆరిపోయి ఉంటాయి.
- మీరు మీ డ్యూటీకి ప్రాధాన్యత ఇచ్చినప్పుడు ఉద్యోగం, కుటుంబంలో పరిస్థితులు ఏలా ఉండేవి?
నేను ఇంటి కంటే పనికి ప్రాధాన్యత ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే కుటుంబానికి సర్దిచెప్పవచ్చు. - ఎంత మంది పిల్లలు ఉన్నారు ప్రస్తుతం ఏం చేస్తున్నారు?
నాకు ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొడుకులిద్దరూ సంగీతంలో పట్టభద్రులయ్యారు. వాళ్లు వారి పని చేసుకుంటున్నారు. కుమార్తె కూడా చదువుకుంటోంది. - సమాజంలో భయపడే మహిళలకు మీరు ఏం చెబుతారు?
మహిళలు భయపడాల్సిన అవసరం లేదు. వారు పూర్తి ధైర్యంతో వారి మార్గంలో ముందుకు సాగాలి. మహిళలు తలుచుకుంటే ఏ పనైనా చేయగలరు.