Sexual Harassment Case on BJP MLA: కర్ణాటక కలబురిగిలోని భాజపా ఎమ్మెల్యే రాజకుమార్ పాటిల్ తెల్కూర్పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. తనను 14 ఏళ్లుగా లైంగికంగా వేధిస్తున్నట్లు ఆరోపిస్తూ ఓ మహిళ.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆయన వల్ల తనకు ఓ బిడ్డ జన్మించిందని.. భరణం కావాలని డిమాండ్ చేస్తోంది.
అయితే దీనిపై స్పందించిన ఎమ్మెల్యే రాజకుమార్ "నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఎలాంటి విచారణకైనా సిద్ధమే. ప్రభుత్వం ఎటువంటి విచారణనైనా నిర్వహించవచ్చు. నేను ఎవరికీ హాని తలపెట్టలేదు. నా పార్టీని, కార్యకర్తలను ఇబ్బంది పెట్టే ఏ పనీ నేను చేయలేదు. చేయను" అని పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేసిన మహిళపై విధానసౌధ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు రాజకుమార్. తనను బ్లాక్‌మెయిల్ చేస్తూ.. రూ.2 కోట్లు డిమాండ్ చేస్తోందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు ఆ మహిళపై కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు.
ఇంట్లోకి చొరబడి..
అయితే విధానసౌధ పోలీసులు తన ఇంట్లోకి చొరబడి.. స్టేషన్‌కు తీసుకెళ్లారని బాధిత మహిళ ఆరోపించింది. "ఆదివారం ఉదయం నుంచి రాత్రి 9 గంటల వరకు స్టేషన్లోనే ఉంచారు. నన్ను చిత్రహింసలకు గురిచేశారు" అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. తన లాయర్ జగదీశ్‌కు వీడియో కాల్ చేసి పోలీస్ స్టేషన్‌లో జరిగిన విషయాన్ని తెలియజేసినట్లు పేర్కొంది. దీంతో న్యాయవాది జగదీశ్.. బాధిత మహిళతో కలిసి ఫేస్‌బుక్ లైవ్‌లో ఈ విషయాన్ని ప్రజల ముందుకు తీసుకొచ్చారు.
"'కాంగ్రెస్ చెప్పినట్లే ఎమ్మెల్యేని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాను' అని లేఖ రాయమని పోలీసులు నన్ను అడిగారు. 'మీరు ఇలా రాస్తే ముఖ్యమంత్రికి ఉపయోగపడుతుంది' అని పోలీసులు చెప్పారు. నేను న్యాయం అడిగాను. కానీ ఆదివారం ఉదయం.. నేను నిద్రలో ఉన్నప్పుడు పోలీసులు (8 మంది సభ్యుల బృందం) అకస్మాత్తుగా నా ఇంటికి వచ్చారు. 'మీరు ఆమెను ఎందుకు తీసుకెళుతున్నారు' అని పోలీసులను మా ఇంటి సెక్యూరిటీ గార్డు అడిగాడు. అయితే అతనిని పోలీసులు కొట్టడానికి ప్రయత్నించారు. స్టేషన్‌కు తీసుకెళ్లిన తర్వాత నన్ను చిత్రహింసలకు గురి చేశారు" అని బాధిత మహిళ ఆరోపించింది.
ఇదీ చూడండి: భార్య, కూతురికి సేవ చేయలేక విసిగి.. గొంతు కోసి..