కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉండబోదని ఆ రాష్ట్ర భాజపా ఇన్ఛార్జ్ అరుణ్ సింగ్ స్పష్టం చేసిన ఒకరోజు తర్వాత సీఎం యడియూరప్ప(CM Yediyurappa) కీలక వ్యాఖ్యలు చేశారు. మరో రెండేళ్ల పాటు తానే సీఎం పదవిలో కొనసాగుతానని.. రాష్ట్ర అభివృద్ధి కోసం పని చేస్తానని పేర్కొన్నారు. జిల్లాల పర్యటనలో భాగంగా ఆయన హాసనకు వెళ్లిన సందర్భంగా విలేకర్లతో మాట్లాడారు.
"నాయకత్వ మార్పు ఉండబోదని పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు అరుణ్‌సింగ్ స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి అమిత్ షాలతో పాటు ఇతర నేతలంతా నాపై విశ్వాసాన్ని ప్రకటించటం వల్ల బాధ్యత మరింత పెరిగింది. ప్రజలకు సేవ చేయటంపైనే ప్రస్తుతం నేను దృష్టి సారించాను. ఊహాగానాల గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు."
-యడియూరప్ప, కర్ణాటక ముఖ్యమంత్రి.
కరోనా నియంత్రణలో అక్రమాలు, పాలన వ్యవహారాల్లో ముఖ్యమంత్రి కుమారుడి జోక్యం, నిధుల విడుదలలో జాప్యం తదితర ఆరోపణలతో భాజపా ఎమ్మెల్యేలు నాయకత్వ మార్పు కోసం డిమాండు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే వారంలో కర్ణాటకలో అరుణ్ సింగ్ పర్యటించే అవకాశాలు ఉన్నాయి. ఎమ్మెల్యేలతో మాట్లాడి కర్ణాటకలోని పరిస్థితులపై నివేదికను భాజపా అధిష్ఠానానికి ఆయన సమర్పించనున్నట్లు తెలుస్తోంది.
ఇదీ చూడండి: Yediyurappa: నా దృష్టంతా ఆ విషయంపైనే
ఇదీ చూడండి: సీఎం మార్పు తప్పదా- పగ్గాలు ఎవరి చేతికి?