Water Flow to Dhavaleswaram Project: ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద నీటిమట్టం గురువారం రాత్రి 10 గంటలకు 9.6 అడుగులకు చేరింది. 6.94 లక్షల క్యూసెక్కుల జలాలు సముద్రంలోకి వదులుతున్నారు. వరద ఇలాగే కొనసాగితే ఇవాళ ఉదయానికి ధవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు తెలిపారు.
గోదావరి ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో ముంపు గ్రామాలు భయం గుప్పిట్లో అల్లాడుతున్నాయి. పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాల నిర్వాసితులకు పూర్తిస్థాయి పునరావాసం కల్పించడంలో ప్రభుత్వం విఫలమైంది. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని విలీన మండలాల ప్రజలు ఇంకా ముంపు గ్రామాల్లోనే ఉంటున్నారు. దేవీపట్నం మండలం గండిపోశమ్మ అమ్మవారి ఆలయం పూర్తిగా నీటమునిగింది. శబరి నదిలో వరద పెరగడంతో ఒడిశా వెళ్లే 326 జాతీయ రహదారిపై భారీగా నీరు చేరింది. 2 రాష్ర్టాల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
భద్రాచలం వద్ద గోదావరి వరద స్థాయి 43 అడుగులకు చేరడంతో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. దీని ప్రభావం విలీన మండలాలపై ఉండటంతో ఏలూరు జిల్లాలోని అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కుక్కునూరు మండలంలో గురువారం గొమ్ముగూడెం గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. వేలేరుపాడు మండలం రేపాకగొమ్ము, రుద్రంకోట, తాట్కూరుగొమ్ముకు చెందిన 300 కుటుంబాలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. వరద ప్రభావానికి కుక్కునూరు- దాచారం మధ్య ఉన్న గుండేటివాగుపై వంతెన మునిగి దాచారం, గొమ్ముగూడెం పంచాయతీల్లో 12 గ్రామాలకు మండల కేంద్రంతో సంబంధాలు తెగిపోయాయి.
గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరుగుతుండటంతో లంక గ్రామాల్లో వణుకు మొదలైంది. గతేడాది జులై 17న గోదావరి నుంచి 25 లక్షల 80వేల 963 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడిచిపెట్టారు. ఈ ఏడాది గోదావరి సాగుతుందో లేదోనని అనుకుంటున్న సమయంలో ఒక్కసారిగా వరదొచ్చింది. దీంతో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పి.గన్నవరం మండలం బూరుగులంకరేవులోకి వరద చేరడంతో తాత్కాలిక రహదారి కొట్టుకుపోయింది. పశ్చిమ గోదావరి జిల్లా అయోధ్యలంక, ఆనగార్లంక, పెదమల్లంక ప్రజలూ పడవను ఆశ్రయిస్తున్నారు. అయినవిల్లి మండలం ముక్తేశ్వరంరేవు వద్ద తాత్కాలిక రహదారి మునిగింది. దీంతో కోటిపల్లిరేవుకు రాకపోకలు నిలిచిపోయాయి.
వరద పెరుగుతున్న కారణంగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేడ్కర్ జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. ఆర్డీవోలు, తహసీల్దార్లు, ఎంపీడీవోలు సంయుక్తంగా ఏటి గట్ల పరిరక్షణ చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి 500 మీటర్ల గట్లకు ఒక వాలంటీరును నియమించాలని ఆదేశించారు.