Volunteers in YSRCP Programme: రాష్ట్రంలోని గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు ఒకరు చొప్పున, పట్టణాల్లో 100 ఇళ్లకు ఒకరు చొప్పున మొత్తం 2.60 లక్షల మంది వాలంటీర్లు ఉన్నారు. మరోవైపు పార్టీ తరఫున ప్రతి సచివాలయానికి ముగ్గురు కన్వీనర్లు, ప్రతి 50 ఇళ్లకు ఒక గృహ సారథిని నియమించారు. చాలా చోట్ల వాలంటీర్ల కుటుంబసభ్యులనే గృహసారథులుగా నియమించే ప్రయత్నాలు జరిగాయి. ఈ నెల 7 నుంచి వైసీపీ ‘మా నమ్మకం నువ్వే జగన్’ పేరుతో కార్యక్రమం నిర్వహిస్తోంది. రాష్ట్రంలోని ప్రతి ఇంటికీ ఈ ప్రచారాన్ని తీసుకు వెళ్లాలని పార్టీ నిర్దేశించింది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామ, వార్డు వాలంటీర్లు ఏం చేయాలో, గృహ సారథులతో కలిసి ఏయే బాధ్యతలు నిర్వర్తించాలో స్పష్టంగా పేర్కొంది. ప్రజలకు వివిధ ప్రశ్నలు సంధించి సమాధానాలు తెలుసుకునే కార్యక్రమాన్నీ చేపడుతున్నారు.
వాటిని చదివి..కరపత్రాన్ని అందజేయాలి: వైసీపీ నియమించిన గృహ సారథులు గ్రామ, వార్డు వాలంటీర్లతో ప్రతి ఇంటికీ వెళ్లి వైసీపీ ప్రతినిధులుగా పరిచయం చేసుకోవాలని.. నిర్దేశించారు. అంటే పార్టీ కార్యక్రమంలో వాలంటీర్ల సాయం తీసుకుంటున్నారని స్పష్టంగా అర్థమవుతోంది. ప్రభుత్వ కార్యక్రమైన ఆసరా లబ్ధిదారులున్న ప్రతి ఇంటికి వాలంటీరు వెళ్లి ప్రభుత్వ ఆసరా లేఖను అందజేయాలి. అంటే ప్రభుత్వ కార్యక్రమంలో కాకుండా ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమంలో భాగంగా ఆసరా లబ్ధిదారులకు ఆ పథకం లబ్ధి ప్రయోజనాల లేఖలు అందించాలని వైసీపీ నిర్దేశించింది. గృహ సారథులు ప్రతి ఇంటికి వెళ్లి ముందుగా గత ప్రభుత్వానికి, ఇప్పటి ప్రభుత్వానికి మధ్య ఉన్న తేడాను కరపత్రంలో ఉన్న అంశాలను చదివి.. తర్వాత కరపత్రాన్ని అందజేయాలి.
వాళ్లు ఉన్నప్పుడు స్టిక్కర్ వద్దని ఎలా చెప్పగలరు!: ప్రజామద్దతు పుస్తకాల్లోని ప్రశ్నలు చదివి, ఇంటివారి సమాధానాలు తెలుసుకుని వాటిని ఆ పత్రంలో నమోదు చేయాలి. ఆ ఇంట్లో ఉన్న వారి పేరు, ఫోన్ నంబరు ఆ స్లిప్పులపై నమోదు చేయాలి. పుస్తకంలోని ప్రశ్నలకు ఆ ఇంటివారి సమాధానం అవును అని చెబితే అందులో కుడివైపు భాగాన్ని చింపి ఆ ఇంటి వారికి ఇవ్వాలి. అలాగే జగన్‌కు తాము మద్దతు తెలియజేస్తున్నామని చెప్పేలా సూచించిన ఫోను నంబరుకు వారే దగ్గరుండి రింగ్ ఇప్పిస్తారు. ఆ ఇంటి వారి అనుమతి తీసుకుంటున్నామనే పేరుతో ఇంటి తలుపు మీద, వారి సెల్‌ఫోన్ పైన జగన్ ఉన్న స్టిక్కరు కూడా అతికించాలి. యజమాని అనుమతితో ఇంటి ముందు స్టిక్కరుతో పాటు ఇంటి యజమాని కనిపించేలా ఫొటో తీసి జేసీఎస్ మండల వాట్సప్ గ్రూపులకు పంపాలి. గృహ సారథులు నింపిన పత్రాన్ని భద్రపరిచి జేసీఎస్ మండల ఇన్‌ఛార్జులకు అందజేయాలి. ప్రభుత్వ పథకాలు పొందుతున్న లబ్ధిదారులు.. వాలంటీర్లు అక్కడే ఉండగా సంబంధిత యజమాని ఆ స్టిక్కరు వద్దని ఎలా చెప్పగలరనేది ఇక్కడ తలెత్తుతున్న ప్రశ్న.
పాలన మంచిగా జరుగుతుందని ప్రచారం చేయాలంటా!: వాలంటీర్లతో పాటు గృహ సారథులు ఇంటింటికీ వెళ్లి గత ప్రభుత్వంలో కన్నా మన ప్రభుత్వ పాలనలో మరింత మంచి జరుగుతోందని ప్రచారం చేయాలట. మన కోసం మన పిల్లల కోసం జగనన్నను నమ్ముతున్నామని ప్రజలందరికీ తెలియజేయాలట. ఇందుకోసం వైసీపీ అందించే కిట్లలో 200 ఇళ్లకు సరిపడే సామగ్రి ఉంటుంది. గృహ సారథులు ధరించేందుకు వీలుగా అయిదు బ్యాడ్జిలు ఇస్తారు. ప్రజామద్దతు సేకరించేందుకు వీలుగా ఒక్కోదానిలో 75 స్లిప్పులు ఉండే 4 పుస్తకాలు ఇస్తారు. గత, ప్రస్తుత ప్రభుత్వాల పనితీరును పోల్చే సమాచారం ఉన్న 200 కరపత్రాలు అందిస్తారు. ఇంటి తలుపులు, సెల్‌ఫోన్లపై అంటించేందుకు 200 చొప్పున స్టిక్కర్లు సరఫరా చేస్తున్నారు. వాటిని తీసుకువెళ్లేందుకు వీలుగా మూడు అదనపు బ్యాగులు అందజేస్తున్నారు.
పార్టీ కార్యక్రమాల్లో వాలంటీర్ల వినియోగం: వాలంటీర్లకు ప్రజాధనాన్ని గౌరవవేతనంగా ఇస్తూ.. ప్రజా సేవా కార్యక్రమాలకే వినియోగిస్తున్నామని ప్రభుత్వం పేర్కొంటోంది. అయితే వైసీపీ సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులతో నిర్వహిస్తున్న పార్టీ సమావేశాలకు వాలంటీర్లు హాజరు కాకపోతే మంత్రులు, ఎమ్మెల్యేలు తప్పుపడుతున్నారు. తప్పనిసరిగా రావాల్సిందేనంటూ హుకుం జారీ చేస్తున్నారు. వైసీపీ గెలుపునకు కృషి చేయాలని నాయకులు వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇంత చేస్తూ వాలంటీర్లను ప్రజాసేవకే వినియోగించుకుంటున్నామని చెప్పడం అవాస్తవం కాదా. సాక్షాత్తూ మంత్రులు ఆదిమూలపు సురేష్, పినిపే విశ్వరూప్, రాజోలు ఎమ్మెల్యే వరప్రసాద్ తదితరులు వాలంటీర్లు వైసీపీ విజయానికి కృషి చేయాలని సమావేశాల్లో పిలుపిచ్చిన మాట వాస్తవం కాదా? పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగానే కాదు ఎప్పుడు ఎన్నికలు జరిగినా.. వాలంటీర్లతో ప్రచారం వాస్తవం కాదా. సంక్షేమ పథకాలకు అర్హులను గుర్తించే పనిని వాలంటీర్లకు ఎలా అప్పచెబుతారని హైకోర్టు.. రాష్ట్ర సెర్ఫ్ అధికారులను గత నెలలో నిలదీయలేదా? ఐనా సరే ఏమాత్రం ఇవి పట్టని వైసీపీ సర్కార్ వాలంటీర్లను పార్టీ సేవలకు వినియోగిస్తూనే ఉంది.
ఇవీ చదవండి: