బంగాల్లో అసెంబ్లీ ఎన్నికల అనంతరం హింసాత్మక ఘటనలు చెలరేగిన తరుణంలో భాజపా ఎమ్మెల్యేలకు భద్రత పెంచాలని నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వం. బంగాల్లోని 61 మంది భాజపా ఎమ్మెల్యేలకు సీఐఎస్ఎఫ్ బలగాలతో 'ఎక్స్' కేటగిరి భద్రత ఏర్పాటు చేసేందుకు కేంద్ర హోంశాఖ శుక్రవారం ఆమోదించింది. ఇప్పటికే కొంత మందికి కేంద్ర బలగాలు భద్రత కల్పిస్తున్నాయి. తాజా నిర్ణయంతో మొత్తం 77 మంది భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాల భద్రత కల్పించినట్లయింది. ఈ నిర్ణయంపై భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు పోలీసు మాజీ ఉన్నతాధికారులు. ముగ్గురు మాజీ ఐపీఎస్ అధికారులను 'ఈటీవీ భారత్' సంప్రదించగా.. ఈ విషయంపై భిన్నంగా స్పందించారు.
ఇది వరకు జరగలేదు..
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాల భద్రత ఏర్పాటు చేయటం గతంలో ఎన్నడూ జరగలేదని ఉత్తర్ప్రదేశ్ మాజీ డీజీపీ ప్రకాశ్ సింగ్ తెలిపారు. ఇలాంటి సంఘటన గతంలో జరిగినట్లు తనకు తెలియదన్నారు.
"ఇంత భారీ స్థాయిలో భద్రత కల్పించినట్లు గతంలో ఎప్పుడూ చూడలేదు. వ్యక్తిగత కేసుల్లోనే చూశాం. అది అర్థం చేసుకోగలం. కానీ, 50-60 మంది ఎమెల్యేలకు భారీ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలియదు. సాధారణంగా, ఎప్పుడూ రాష్ట్ర అభిప్రాయాలను తీసుకుంటారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం అడగకుండానే.. కేంద్రం బలగాలను మోహరించిన సందర్భాలూ ఉన్నాయి. అది నిజం. అందుకు తగిన ఉదాహరణలు ఉన్నాయి. "
- ప్రకాశ్ సింగ్, యూపీ మాజీ డీజీపీ, బీఎస్ఎఫ్ మాజీ డీజీ.
ఆ సందర్భాల్లో భద్రత కల్పించొచ్చు..
ఈ విషయంపై సానుకూలంగా స్పందించారు సీఆర్పీఎఫ్కు నేతృత్వం వహించిన మాజీ ఐపీఎస్ అధికారి ఒకరు. నిఘా విభాగాల సమాచారం, ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అలాంటి భద్రత ఏర్పాటు చేయటం సాధారణమేనని తెలిపారు.
" ఎమ్మెల్యేలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉన్న సందర్భంలో ప్రభుత్వం భద్రత ఏర్పాటు చేస్తుంది. జమ్ముకశ్మీర్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో తిరుగుబాటుదారుల దాడుల నేపథ్యంలో ఇలాంటివి జరిగిన సందర్భాలు ఉన్నాయి. అలాంటిది ఈ రాష్ట్రంలో జరగటం ఇదే తొలిసారి. అందుకు గల కారణాలేంటో నాకు తెలియదు. కానీ, నిజంగా ముప్పు ఉంటే భద్రత కల్పించాల్సిందే. "
- ఐపీఎస్ అధికారి.
సరైన నిర్ణయం కాదు..
భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర బలగాలతో భద్రత ఏర్పాటు చేయటాన్ని తప్పుపట్టారు మాజీ ఐపీఎస్ అధికారి, త్రిపుర మాజీ డీజీపీ కేఎస్ సుబ్రహ్మణ్యం. ఇది కేంద్ర ప్రభుత్వం తమ అధికారాన్ని దుర్వినియోగం చేయటమేనన్నారు. ఎమ్మెల్యేలకు ఎదురయ్యే ముప్పును ఇంటలిజెన్స్ బ్యూరో అంచనా వేసి వీఐపీ భద్రత కల్పిస్తుందని సూచించారు.
"ఇది వీఐపీ భద్రత కాదు. రాష్ట్ర ప్రభుత్వ ఏజెన్సీలను కల్పించే అర్హత లేని వారికి మీరు వ్యక్తిగత భద్రత కల్పిస్తున్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగమే. ఐబీ బలంగా ఉంటే ఈ నిర్ణయాన్ని తిరస్కరిస్తుంది. ఇది గతంలో ఎన్నడూ లేని, అన్యాయమైన చర్య. బాధ్యతారాహిత్యంగా ఇలాంటి చర్యలు తీసుకుంటున్నారు. "
- కేఎస్, సుబ్రహ్మణ్యం, రిటైర్డ్ ఐపీఎస్.
నిర్ణయం వెనుక రాజకీయం?
ఎమ్మెల్యేలకు వీఐపీ భద్రత కల్పించటం వెనక రాజకీయ వివక్ష ఉందని అభిప్రాయపడ్డారు న్యాయవాది మాథ్యూ ఇడికుల్లా. కేంద్ర బలగాల విషయానికి వస్తే.. సీఐఎస్ఎఫ్, ఎస్పీజీ, జెడ్ క్యాటగిరీలు ఉంటాయన్నారు. వాటి నిర్ణయం పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుందని స్పష్టం చేశారు. విపక్ష నేతల ముప్పుపైనా కేంద్రమే సమీక్షిస్తుందని గుర్తు చేశారు. బంగాల్ విషయంలో రాష్ట్ర అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేకుండా నిర్ణయం తీసుకోవటం అనేది రాజకీయ వివక్ష ఉండేందుకు అస్కారం కల్పిస్తోందన్నారు. చాలా రాష్ట్రాల్లో భాజపా అధికారంలో ఉందని, కానీ అక్కడ విపక్ష ఎమ్మెల్యేలకు అలాంటి భద్రత కల్పించిన దాఖలాలు లేవని గుర్తు చేశారు.
ఎన్నికల తర్వాత హింసపై ఆందోళన..
రాష్ట్రంలో ఎన్నికల తర్వాత హింస చెలరేగటంపై ఆందోళన వ్యక్తం చేశారు సామాజిక కార్యకర్త ప్రకాశ్ సింగ్. హింసను అరికట్టటంలో మమతా బెనర్జీ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ' ఎమ్మెల్యేలకు భద్రత ఎందుకు కల్పించాలి. శాంతిభద్రతలు అనేది రాష్ట్ర అంశమని కేంద్రం గ్రహించాలి. సామాన్యాలకు భద్రత కల్పించాలని రాష్ట్రంపై కేంద్రంపై ఒత్తిడి తేవాలి. భాజపాకు ఓటు వేసిన వారే లక్ష్యంగా టీఎంసీ సభ్యులు దాడులు చేస్తున్నారు. ఇలాంటి ఘటన ఏ రాష్ట్రంలోనూ జరగలేదు. వివిధ పార్టీలకు ప్రజలు ఓట్లు వేస్తారు. ఫలితాలు వచ్చాక అందరిని సమానంగా చూడాలి. ' అని పేర్కొన్నారు.
ఇదీ చూడండి: బంగాల్ భాజపా ఎమ్మెల్యేలకు కేంద్ర భద్రత!