VIP Security For BJP Leaders: ఎన్నికల నేపథ్యంలో పంజాబ్, ఉత్తర్‌ప్రదేశ్‌లోని దాదాపు 24 మంది భాజపా నేతలకు 'వీఐపీ కేటగిరీ' భద్రతను కల్పించింది కేంద్ర ప్రభుత్వం. ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై పోటీ చేస్తున్న కేంద్రమంత్రి స్పీఎస్ బఘేల్‌కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించినట్లు అధికారులు తెలిపారు.
బఘేల్‌తోపాటు భాజపా ఎంపీ, సింగర్ హన్స్ రాజ్ హన్స్‌కు కూడా జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది కేంద్రం. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన భాజపా ఎంపీ రమేశ్ చంద్ బింద్‌కు ఎక్స్ కేటగిరీ భద్రతను కల్పించినట్లు అధికారులు వెల్లడించారు. వీరికి భద్రతగా సీఆర్పీఎఫ్, సీఐఎస్ఎఫ్ బలగాలను కేంద్రం పంపినట్లు తెలిపారు. వీరిలో కొద్దిమంది నేతలకు మాత్రం ఎన్నికల కార్యక్రమాలు అయ్యేంతవరకు 'వీఐపీ కేటగిరీ' భద్రతను కేంద్రం కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.
బఘేల్ ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌పై కర్హల్ నియోజకవర్గం నుంచి పోటీచేస్తున్నారు. మెయిన్‌పురి జిల్లాలో బఘేల్ కాన్వాయ్‌పై ఎస్పీకి చెందిన దుండగులు దాడికి దిగారని భాజపా నేతలు మంగళవారం ఆరోపణలు చేశారు.
ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కనీసం 20 మంది నేతలకు భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వం సీఆర్పీఎఫ్కు సూచనలు చేసింది. భద్రతను కొనసాగించడంపై మార్చి 10 ఓట్ల లెక్కింపు తర్వాత కేంద్రం సమీక్షిస్తుందని అధికారులు తెలిపారు.
పంజాబ్‌లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనుండగా.. ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో ఎన్నికలు జరగున్నాయి. ఇప్పటికే యూపీలో రెండు దశలు పూర్తికాగా.. మూడోదశ ఎన్నికలు ఫిబ్రవరి 20న జరగనున్నాయి.
ఇవీ చూడండి:
'ఈ ఎన్నికల్లో ప్రయోగాలు వద్దు'.. పంజాబ్ ప్రజలకు రాహుల్ విజ్ఞప్తి