దసరా రోజున యూపీలోని ఝాన్సీ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు, ఏడుగురు మహిళలు ఉన్నారు. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పండోఖర్ నుంచి చిర్గావ్కు 30 కుటుంబాలకు చెందిన భక్తులు ట్రాక్టర్లో వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. వీరంతా దసరా సందర్భంగా అమ్మవారి దర్శనానికి వెళ్లి వస్తున్నట్లు తెలిసింది.
'వేగంగా వెళ్తున్న ట్రాక్టర్కు ఓ జంతువు అడ్డుగా వచ్చింది. దానిని తప్పించే క్రమంలో డ్రైవర్ నియంత్రణ కోల్పోయాడు. దీనితో ట్రాలీ అదుపుతప్పి బోల్తాపడింది' అని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. సమాచారం అందిన వెంటనే చేరుకున్న పోలీసులు.. స్థానికులతో తోడ్పాటుతో సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనపై ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకునేందుకు మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు.