Uttarakhand Transformer accident : ఉత్తరాఖండ్‌లో కరెంట్ షాక్ తగిలి 15 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. మృతుల్లో ముగ్గురు పోలీస్ ఇన్స్పెక్టర్లు, ముగ్గురు హోంగార్డులు కూడా ఉన్నారు. చమోలీ జిల్లాలో అలకనందా నది ఒడ్డున.. నమామి గంగే ప్రాజెక్ట్ సైట్ దగ్గర బుధవారం ఈ ఘటన జరిగింది. ఓ పంపింగ్ స్టేషన్ దగ్గర్లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పేలిపోవడం వల్ల ఇనుప రెయిలింగ్‌కు కరెంట్ సరఫరా జరిగినట్లు తెలిసింది. అక్కడే ఉన్న వారిలో కొందరు ఘటనాస్థలిలోనే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
"మంగళవారం రాత్రి ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు మరణించాడు. దీంతో బుధవారం ఉదయం ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు.. పంచనామా నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో ట్రాన్స్ఫార్మర్ పేలి రెయిలింగ్‌కు విద్యుత్ సరఫరా కావడం వల్లే ఇలా జరిగిందని ప్రాథమికంగా తెలిసింది. దర్యాప్తులో మరిన్ని వివరాలు తెలుస్తాయి." అని ఉత్తరాఖండ్ అదనపు డీజీపీ వి.మురుగేశన్ తెలిపారు.
విచారణకు ముఖ్యమంత్రి ఆదేశం
Uttarakhand Electrocution News : ఈ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై మెజిస్టేరియల్ విచారణకు ఆదేశించారు. "ఇది చాలా బాధకరమైన ఘటన. జిల్లా యంత్రాంగం, పోలీసులు, రాష్ట్ర విపత్తు స్పందన దళం సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను హెలికాప్టర్ ద్వారా రిషికేశ్ ఎయిమ్స్ తరలిస్తున్నారు. మెజిస్టీరియల్ విచారణ జరపాలని ఆదేశాలు ఇచ్చాం" అని చెప్పారు.
ప్రధాని మోదీ తీవ్ర సంతాపం
ఈ ప్రమాద ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతులు కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని.. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
కరెంట్ షాక్‌తో మరో ఇద్దరు మృతి
రాజస్థాన్‌లో ఓ బస్టాండ్‌లో కరెంట్ షాక్ తగిలి ఇద్దరు మరణించారు. భిల్వాఢా బస్టాండ్‌లోని జ్యూస్ మెషీన్ నుంచి కరెంట్ షాక్ తగలడం వల్ల మరణించారని సీఐ యోగేశ్ శర్మ తెలిపారు. వీరిని బాబులాల్ మీనా(40), నౌశద్(34) గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామని చెప్పారు.
ఇవీ చదవండి : కావడి యాత్రలో విషాదం.. కరెంట్ షాక్‌కు గురై ఐదుగురు భక్తులు మృతి.. మరో 16 మంది..
రోడ్డు దాటుతూ కరెంట్ స్తంభాన్ని తాకి మహిళ మృతి.. విహార యాత్రకు వెళ్తుండగా ప్రమాదం..