UP Election 2022: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఆరో విడత అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మొత్తం 111 స్థానాలు ఉండే పూర్వాంచల్ ప్రాంతంలోని 57 స్థానాలకు గురువారం ఓటింగ్ జరుగుతోంది. యూపీలో ఇప్పటివరకు 403 స్థానాలకుగానూ 292 సీట్లకు ఎన్నికలు జరిగాయి.
అంబేడ్కర్ నగర్, బలరాంపుర్, సిద్ధార్థ్‌నగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహారాజ్ గంజ్, గోరఖ్‌పుర్, ఖుషీనగర్, దేవరియా, బలియా జిల్లాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 10 జిల్లాల్లోని ఈ నియోజకవర్గాల్లో ప్రధానంగా భాజపా, ఎస్పీ కూటముల మధ్యే పోరు ఉంటుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ఓటు వేసిన సీఎం..
గోరఖ్‌పుర్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. కన్యా నగర్ క్షేత్రలోని పోలింగ్ కేంద్రం వద్ద ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు గోరఖ్‌నాథ్ ఆలయాన్ని దర్శించి పూజలు నిర్వహించారు.
ఇదీ చూడండి : యుద్ధ ప్రాతిపదికన పౌరుల తరలింపు... పాస్‌పోర్ట్ లేకున్నా..