ఒలింపిక్ పతక విజేత సుశీల్ కుమార్ నిందితుడిగా ఉన్న రెజ్లర్ సాగర్ ధన్కర్ హత్య కేసు కొత్త మలుపు తిరిగింది. పుట్టిన రోజు వేడుకలకు అతిథిగా వచ్చిన ఓ విదేశీ మహిళ.. ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారణమైందని దిల్లీ పోలీసులు అనుమానిస్తున్నారు. ఉక్రెయిన్‌కు చెందిన ఈమె.. సాగర్ స్నేహితుడైన సోనూకు పరిచయస్తురాలని పోలీసులు వెల్లడించారు. కేసులో కీలకంగా మారిన ఈమె.. ప్రస్తుతం పరారీలో ఉంది. ఆమె ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
హత్యతో ఈమెకు ఏంటి సంబంధం?
పోలీసుల ప్రకారం... మార్చి నెలలో.. తన స్నేహితుడు సోనూ పుట్టినరోజు వేడుకలను అతడి స్నేహితురాలి సమక్షంలో నిర్వహించాలని సాగర్ భావించాడు. ప్రత్యేక అతిథిగా ఉక్రెయిన్‌కు చెందిన మహిళను ఆహ్వానించారు. విషయం తెలుసుకున్న అజయ్ ఆ ఫ్లాట్ వద్దకు చేరుకున్నాడు. ఆమెతో సెల్ఫీ తీసుకోవడమే కాక అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో సాగర్, సోను.. అజయ్‌తో వాగ్వాదానికి దిగారు.
ఈ ఘటనకు ప్రతీకారంగా మే 4న అజయ్.. ప్రధాన నిందితుడు సుశీల్ సాయంతో సాగర్, సోనూపై దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో సాగర్ మృతిచెందాడు.
ఇదీ చదవండి : పాసవాన్‌కు మరో షాక్- అధ్యక్ష పదవి నుంచి తొలగింపు