జమ్ముకశ్మీర్ లోని మల్‌హురా ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. ఒక విదేశీ ఉగ్రవాది సహా లష్కరే తొయిబా కమాండర్ అబ్రార్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయినట్లు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ తెలిపారు.
పరిమ్పొరా ప్రాంతంలోని మల్‌హూరా వద్ద ఉగ్రవాదులు దాగి ఉన్నారనే సమాచారంతో సైన్యం సోమవారం తనిఖీలు చేపట్టింది. ఈ సందర్భంగా ఒక వాహనాన్ని ఆపగా వెనక కూర్చున్న వ్యక్తి హ్యాండ్ గ్రనేడ్‌తో దాడి చేసే ప్రయత్నం చేశాడని ఐజీ తెలిపారు. వెంటనే భద్రతా బలగాలు అప్రమత్తమై అతడిని అరెస్ట్ చేసి పరిశీలించగా లష్కరే తొయిబా కమాండర్ అబ్రార్ అని గుర్తించినట్లు వెల్లడించారు. విచారణలో తన ఇంటిలో ఏకే-47 దాచినట్లు అబ్రార్ చెప్పినట్లు ఐజీ విజయ్ కుమార్ పేర్కొన్నారు.
ఏకే-47 స్వాధీనం చేసుకునేందుకు మల్‌హూరా ప్రాంతంలోని అతడి ఇంటికి అబ్రార్‌ను తీసుకెళ్లగా..ఇంటిలో దాగి ఉన్న విదేశీ ఉగ్రవాది బలగాలపై కాల్పులు జరిపినట్లు ఐజీ తెలిపారు. కాల్పుల్లో ముగ్గురు సీఆర్‌పీఎఫ్ సిబ్బంది, ఉగ్రవాది అబ్రార్ గాయపడినట్లు వివరించారు. వెంటనే బలగాలు ఎదురుకాల్పులు జరపగా.. విదేశీ తీవ్రవాది హతమైనట్లు చెప్పారు. గాయపడిన అబ్రార్ కూడా చనిపోయాడని కశ్మీర్ ఐజీ వెల్లడించారు. రెండు ఏకే-47లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు.