Tree Cutting Kerala : జాతీయ రహదారుల సంస్థ(ఎన్హెచ్ఏఐ) అధికారులు చేసిన అనాలోచిత చర్య వల్ల అనేక పక్షులు మరణించాయి. ఈ దారుణ ఘటన కేరళలోని మలప్పురంలో జరిగింది. రండతనిలో ఓ రోడ్డు విస్తరణను చేపట్టిన జాతీయ రహదారుల సంస్థ అధికారులు.. రోడ్డు పక్కన ఉన్న చెట్టును యంత్రం సాయంతో నరికివేశారు. దీంతో చెట్టు ఒక్కసారిగా కిందపడింది. చెట్టుపైన ఆశ్రయం పొందుతున్న అనేక సంఖ్యలో పక్షులు కిందపడి ఆ దెబ్బలకు మృత్యువాతపడ్డాయి. దీనికి సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దీనిపై స్పందించిన పీడబ్ల్యూడీ మంత్రి మహ్మద్ రియాజ్.. జాతీయ రహదారుల సంస్థ అధికారుల నుంచి వివరణను కోరారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చట్టపరంగా కఠినచర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోవైపు చెట్టు నరికివేసిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు ఎడవన్న అటవీ అధికారులు.
పక్షుల మరణానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలంటూ కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ఫిర్యాదు చేశారు సేవ్ వెట్‌ల్యాండ్స్ ఇంటర్నేషనల్ మూవ్మెంట్ సంస్థ ప్రతినిధులు. వందలాది పక్షులు మరణించడం బాధాకరమని.. చిన్న పక్షులు గాయపడ్డాయని కనీసం ఎగరలేక పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర మంత్రి గడ్కరీ.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేముందు.. పక్షులకు సరైన పునరావాస చర్యలు తీసుకోవాలని కోరారు. దశాబ్దానికి పైగా ఉన్న చెట్లు ఉన్నాయని.. వాటిపైనే ఆశ్రయం పొందుతూ వేలాది పక్షులు జీవిస్తున్నాయని.. చెట్లను నరికివేయకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రమంత్రికి విన్నవించారు.
ఇవీ చదవండి: గిరిజనుడిపై చిరుత దాడి.. పదునైన కత్తితో హతమార్చి..
దళిత ఉపాధ్యాయురాలిపై కుల వివక్ష.. అంగన్వాడీని కాన్వెంట్లా తీర్చిదిద్ది..