Tomato CCTV Camera : దేశవ్యాప్తంగా టమాటాల ధరలు మండిపోతున్నాయి. కొన్ని చోట్ల వీటి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. దీంతో సామాన్యులు టమాటాలు కొనడం కష్టంగా మారింది. అయితే ధర పెరిగితే సాధారణంగా రైతులు అనందపడతారు. కానీ, టమాటాలను దొంగతనం చేయడం వంటి పరిణామాలు రైతులకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. చేతికి వచ్చిన పంటను మంచి రేటుకు అమ్ముకుందామనుకునే రైతులు.. ఎక్కడ దొంగలు ఎత్తుకెళ్తారో అని రాత్రింబవళ్లు కాపలా ఉండాల్సి వస్తోంది. ఇలాంటి పరిస్థితే కర్ణాటక.. మైసూరు జిల్లాలోని ఇద్దరు రైతు సోదరులకు ఎదురైంది.
హున్సుర్ మండలంలోని కుప్పే గ్రామానికి చెందిన ఇద్దరు రైతు సోదరులకు నగేశ్, కృష్ణకు 10 ఎకరాలు పొలం ఉంది. అందులో మూడున్నర ఎకరాల్లో టమాటా సాగు చేశారు. టమాటా ధరలు పెరిగిన నేపథ్యంలో.. వీరి పొలంలో దొంగలు పడ్డారు. అయితే, వారిని చాకచక్యంగా పట్టుకున్న రైతులు.. బిలికెరే పోలీసులకు అప్పగించారు. దీంతో ఇలాంటి ఘటన మళ్లీ జరగకుండా ఉండేందుకు రైతులు ఏదైనా చేయాలనుకున్నారు. అనుకున్నదే తడవుగా.. సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. అనంతరం రెండు సీసీటీవీ కెమెరాలను అమర్చి.. తమ మొబైల్ ఫోన్లకు అనుసంధానం చేసుకున్నారు. దీని ద్వారా పొలంలో ప్రతి కదలికను గమనిస్తున్నారు. ఏదైనా అనుమానస్పదంగా అనిపిస్తే వెంటనే స్పందిస్తున్నారు.
Tomato price Hike : "ఎకరానికి 10 వేల మొక్కలు నాటి, బిందు సేద్యం ద్వారా సాగు చేశాం. ఇప్పటివరకు 15 సార్లు టమాటా సాగు చేశాం. కిలో సగటున రూ.70 నుంచి రూ.75 విక్రయించాం. ఇప్పటివరకు టమాటా పంటల ద్వారా రూ. 4 లక్షల ఆదాయం వచ్చింది. ఆగస్టులో మళ్లీ మొక్కలు నాటుతాం" అని రైతు సోదరులు తెలిపారు.