మమతా బెనర్జీ పేరు వినగానే.. తెల్లని నూలు చీర, జోలెలా భుజానికి వేలాడే సంచి.. కాళ్లకు రబ్బరు చెప్పులతో కూడిన రూపం గుర్తొస్తుంది! ఆమె 1955 జనవరి 5న ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో జన్మించారు. తల్లి గాయత్రీ దేవి. తండ్రి ప్రొమిలేశ్వర్ బెనర్జీ. ప్రొమిలేశ్వర్ కాంగ్రెస్‌లో క్రియాశీలకంగా వ్యవహరించేవారు. ఆయన బాటలో.. కళాశాల విద్యార్థినిగా ఉన్నప్పుడే మమత కాంగ్రెస్ విద్యార్థి విభాగంలో చేరారు. చిన్నప్పటి నుంచే ఆమె ఫైర్‌బ్రాండ్. మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీని అభిమానించేవారు. 1977లో ఇందిరా గాంధీకి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించేందుకు లోక్‌నాయక్ జయప్రకాశ్ నారాయణ్ (జేపీ) ఓసారి కోల్‌కతాకు వచ్చారు. ర్యాలీ ఏమాత్రం ఇష్టంలేని మమత.. ఆయన వాహనశ్రేణిని అడ్డుకున్నారు. జేపీ కారు ముందు స్వయంగా బైఠాయించారు. కారు ముందుభాగంపైకి ఎక్కి ఆమె నృత్యం చేశారని కూడా అప్పట్లో కొన్ని పత్రికలు రాశాయి. నాడు చూపిన తెగువతో ఆమె కాంగ్రెస్ సీనియర్ నేతల దృష్టిలో పడ్డారు.
సోమ్‌నాథ్ ఛటర్జీపై సంచలన విజయం
దూకుడుకు మారుపేరైన దీదీ రాజకీయాల్లో వడివడిగా ఎదిగారు. 1984లో జాదవ్‌పుర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమె.. కమ్యూనిస్టు దిగ్గజం సోమ్‌నాథ్ ఛటర్జీని ఓడించి అందర్నీ నివ్వెరపర్చారు. అదే ఏడాది కాంగ్రెస్ యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. కాంగ్రెస్‌పై దేశవ్యాప్తంగా పెరిగిన వ్యతిరేకత ప్రభావంతో మమత 1989 ఎన్నికల్లో ఓడిపోయినా.. 1991లో మళ్లీ గెలిచారు. 36 ఏళ్లకే కేంద్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.
బంగాల్‌లో అధికారమే ఎజెండాగా..
కేంద్ర రాజకీయాల్లో కీలకంగా మారినా, మమత మనసంతా బంగాల్‌పైనే ఉండేది. సీపీఎంతో తమ పార్టీ సన్నిహితంగా ఉంటుండటం ఆమెకు ఏమాత్రం నచ్చేది కాదు. అందుకే 1997లో కాంగ్రెస్ నుంచి బయటికొచ్చారు. సొంతంగా తృణమూల్ కాంగ్రెస్‌ను స్థాపించారు. రాష్ట్రంలో కామ్రేడ్లను గద్దె దించడమే ఎజెండాగా పెట్టుకున్నారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని, ఎట్టకేలకు తన లక్ష్యాన్ని 2011లో అందుకున్నారు. ఆ ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలను మట్టికరిపించి, సీఎం పీఠమెక్కారు. బంగాల్‌కు తొలి మహిళా సీఎం ఆమే.
కుండబద్దలు కొట్టినట్లు..
మమత తన మనసులో ఏమనుకుంటే దాన్ని సూటిగా బయటకు చెప్పేస్తారు. దాపరికం అనే పదం ఆమెకు తెలియదు. కేంద్రంలో కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నప్పుడు కొన్ని విధానాల విషయంలో సొంత ప్రభుత్వంపైనే విమర్శలు గుప్పించారు. ఇక పలు సందర్భాల్లో మమత చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. పురుషులు, మహిళలు స్వేచ్ఛగా మాట్లాడుకునే వీలుండటం వల్లే అత్యాచారాలు పెరిగాయంటూ ఓ సందర్భంలో ఆమె వ్యాఖ్యానించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
రాజీవ్‌తో ప్రత్యేక అనుబంధం
మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని మమత విపరీతంగా అభిమానించేవారు. ఆయన్ను తన మెంటార్‌గా భావించేవారు. 1984 ఎన్నికల్లో మమతను జాదవ్‌పుర్‌లో తమ పార్టీ అభ్యర్థిగా నిలబెట్టింది రాజీవే. ఆయన మరణించినప్పుడు దీదీ చాలా కుంగిపోయారు. వారంపాటు ఎవరితోనూ మాట్లాడలేదు. గదిలో ఏడుస్తూ కూర్చున్నారు. "మా నాన్న తిరిగిరాని లోకాలకు వెళ్లినప్పుడు నేను అనాథనయ్యాననిపించింది. రాజీవ్ మరణించినప్పుడు రెండోసారి అనాథగా మారినట్లు అనిపించింది" అని ఆయనతో అనుబంధం గురించి మమత ఓ పుస్తకంలో రాశారు.
- 1998 డిసెంబరులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై లోక్‌సభలో నిరసన తెలుపుతున్న సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డోగ్రా ప్రసాద్ సరోజ్‌ను మమత అత్యంత వివాదాస్పద రీతిలో గల్లా పట్టుకొని వెల్ నుంచి బయటకు లాగారు.
- దీదీ మంచి రచయిత. 20కిపైగా పుస్తకాలు రాశారు. ఆమె పెయింటర్ కూడా. తాను గీసిన చిత్రాలతో ఎగ్జిబిషన్లూ ఏర్పాటుచేశారు. పాటలు కూడా బాగా పాడతారు.
- ప్రధాని మోదీ, మమత మధ్య రాజకీయపరమైన విభేదాలున్నా.. వ్యక్తిగతంగా వారి మధ్య సత్సంబంధాలే ఉన్నాయి. తనకు దీదీ ఏటా కుర్తా పంపిస్తుంటారని మోదీ ఓసారి స్వయంగా చెప్పారు.
- 1999లో ఎన్డీయేతో దీదీ జట్టుకట్టారు. అయితే రెండేళ్లకే దాన్నుంచి బయటికొచ్చారు.
- రాజకీయాల్లో తీరిక లేకుండా ఉన్నా.. మమత తన కుటుంబాన్ని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయలేదు. ఏమాత్రం వీలు చిక్కినా ఆమే స్వయంగా తల్లి కోసం వంట చేసేవారు. స్వెటర్లూ కుట్టేవారు.
- 'మా-మాటీ-మానుష్ (తల్లి, భూమి, ప్రజలు)' నినాదంతో బెంగాల్ ప్రజలకు దీదీ మానసికంగా బాగా చేరువయ్యారు.
- పెళ్లి చేసుకోకుండా తన జీవితాన్ని ప్రజా సేవకే అంకితం చేశారు దీదీ.
ఇదీ చదవండి: మినీ సార్వత్రికంలో మెరవని సినీ తారలు!