పెంపుడు శునకాలను ఇంట్లో ఓ మనిషిలా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. వాటికి రోజూ స్నానం చేసి, కావాల్సిన ఆహారాన్ని సమయానికి పెడతారు. అయితే వీధి కుక్కలను అలా ఎవరు చూసుకుంటారు? వాటికి ఆహారం ఎవరు పెడతారు? ఈ విషయాన్ని గుర్తించారు కర్ణాటకలోని చిత్రదుర్గా ప్రాంతానికి చెందిన జంతు ప్రేమికురాలు పద్మావతి. తన ద్విచక్ర వాహనంపై ఆహారం తీసుకెళ్లి.. రోజూ 80 వీధి శునకాలకు ఆహారం అందిస్తున్నారు. ఒకవేళ కుక్కలు అనారోగ్యంగా ఉంటే వైద్యం చేస్తున్నారు.
వారసత్వం పునికి పుచ్చుకుని..
పద్మావతి తల్లి చిన్నప్పుడు నుంచి వీధి కుక్కలను పెంచుతున్నారు. ఆమె వారసత్వాన్ని పునికి పుచ్చుకొని రోజూ ఉదయం, సాయంత్రం.. వాటికి ఆహారం అందిస్తున్నారు పద్మావతి. ఈ కార్యక్రమాన్ని గత ఐదారేళ్లుగా నిర్వహిస్తున్నారు.
బైక్ శబ్ధం వింటే చాలు
ఆమె ద్విచక్ర వాహనం హార్న్ వింటే చాలు.. శునకాలన్నీ ఒక్కసారిగా పద్మావతి వద్దకు చేరుకుంటాయి. ఆమె కుమార్తె కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం విశేషం. తల్లితో పాటు వెళ్లి పాత్రల్లో శునకాలకు ఆహారం పెడుతూ.. అమ్మకు సాయం చేస్తుంది.
"మనం వాటితో ప్రేమగా వ్యవహరిస్తే.. అవీ మనపై విశ్వాసం చూపుతాయి. కుక్కల్లో జాతులు వేరుగా ఉండొచ్చు. కానీ అవి చూపే విశ్వాసం మాత్రం ఒక్కటే" అని అన్నారు పద్మావతి.
ఇదీ చూడండి: ఆ రచయితకు రాయడం.. అమ్మడం రెండూ తెలుసు