ap police prestige fallen to the bottom : శాంతి భద్రతలు, పనితీరు, సమర్థత సహా పేరు ప్రఖ్యాతలతో గతంలో దేశంలోనే ముందు వరుసలో నిలిచిన ఆంధ్రప్రదేశ్ పోలీసు విభాగం ప్రతిష్ఠ .. ఇప్పుడు పాతాళానికి పతనమైపోయింది. వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయటానికి సహకరించాలని సీబీఐ లాంటి ప్రతిష్ఠాత్మక దర్యాప్తు సంస్థ కోరితే... తమ వల్ల కాదని పోలీస్ శాఖ చేతులెత్తేసింది. ప్రతిపక్ష పార్టీల నాయకులు, ప్రజా సంఘాలు, ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికులు ఎప్పుడైనా, ఏదైనా కార్యక్రమానికి పిలుపునిస్తే సెక్షన్ 30, సెక్షన్ 144 పేరిట ఆంక్షలు విధించి ఇంటి నుంచి కాలు కూడా బయటపెట్టనీయకుండా నిర్బంధాలు అమలు చేస్తున్న పోలీసులు.. హత్య కేసులో నిందితుడికి రక్షణకవచంలా నిలవడం సర్వత్రా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సీబీఐని ఆ సమీపంలోకి రాకుండా మోహరించినా.. గుంపులుగా చేరిన అవినాష్‌రెడ్డి అనుచరుల్ని మాత్రం అక్కడి నుంచి మాత్రం చెదరగొట్టలేదు సరికదా... ఆ దిశగా కనీస ప్రయత్నమైనా చేయలేదు.
మీడియాపై దాడులకు తెగబడినా.. అవినాష్ అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు మీడియాపైన దాడులకు పాల్పడ్డా పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించారు. కెమెరాలు ధ్వంసం చేస్తూ, అల్లర్లకు, దౌర్జన్యానికి తెగబడుతున్నా సరే... వారిని చూస్తూ ఉండిపోయారే తప్ప చర్యలు తీసుకోలేదు. జీవో నంబర్ 1 పేరిట రోడ్డుపైన ఎలాంటి సభలు, కార్యక్రమాలు నిర్వహించకూడదంటూ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్న పోలీసులు.. కర్నూలులో విశ్వభారతి ఆస్పత్రి వద్ద వందల మంది అవినాష్‌రెడ్డి అనుచరులు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఆందోళన చేయడంపై కిమ్మనలేదు. దాదాపు పది ఆస్పత్రులు, క్లినిక్‌లకు వచ్చే వందలాది మంది రోగులు, వారి బంధువులు రాకపోకలకు ఇబ్బందులు కలుగుతున్నా ఎలాంటి చర్యలూ తీసుకోలేదు.
అవసరం అనకుంటే.. జిల్లా ఎస్పీ తలుచుకుంటే గంటల వ్యవధిలో వారందర్నీ అక్కడి నుంచి ఖాళీ చేయించి పరిస్థితిని అదుపులోకి తీసుకోవచ్చు. కర్నూలు నగరంలో 5 పోలీసుస్టేషన్లు, సమీప పరిధిలో మరో 15 పోలీసు స్టేషన్లు ఉన్నాయి. ఎస్పీ ఆధీనంలోనే వందల మంది ఏఆర్ సిబ్బంది.. కర్నూలులో ఏపీఎస్సీ బెటాలియన్ కూడా ఉంది. అవసరం అనుకుంటే.. పక్క జిల్లాల నుంచి కూడా గంటల వ్యవధిలోనే భారీగానే బలగాల్ని పిలిపించుకోవచ్చు. కనీసం రెండు, మూడు గంటల్లో దాదాపు వెయ్యి మంది పోలీసులను ఎస్పీ చాలా సులువుగా రప్పించే అవకాశాలున్నాయి. విశ్వభారతి అస్పత్రి వద్ద అల్లర్లు, దౌర్జన్యానికి పాల్పడుతున్న వారిని అక్కడి నుంచి ఖాళీ చేయించే వీలున్నా.. ఈ విషయంలో తానేమీ చేయలేనని ఆయన చేతులేత్తేశారంటే దీని వెనక ఎంతటి శక్తిమంతులు ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. సీబీఐకి సహాయ నిరాకరణ చేయటం వల్ల కెరీర్‌పై మచ్చ పడుతుందని తెలిసీ.. ఎస్పీ అలా వ్యవహరించారంటే ఆయనపై ఎవరి ఆదేశాలు పనిచేసుంటాయో ప్రతి ఒక్కరికీ తెలుసనే చర్చ వినిపిస్తోంది. ఒకప్పుడు యూపీ, బీహార్‌లో నెలకొన్న పరిస్థితుల్ని ఆంధ్రప్రదేశ్‌కు తీసుకొచ్చిన ఘనత జగన్ ప్రభుత్వానికి, రాష్ట్ర పోలీసులకే దక్కింది.
ఇవీ చదవండి :