Film Industry reaction on CBN arrest: తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ... ఆయనకు మద్దతుగా చిత్రపరిశ్రమకు చెందిన ప్రముఖులు ‘చంద్రబాబు గారితో మనం’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. మురళీ మోహన్ అధ్యక్షతన హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నిర్మాతలు, దర్శకులు పాల్గొన్నారు. ఎలాంటి ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం తగదని పేర్కొన్నారు. కనుక చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో అందరి గుండెల్లోనూ బాధ ఉందని మురళీ మోహన్ పేర్కొన్నారు. గుండెలు మండిపోతున్నాయి. కానీ ఎలా బయటకు రావాలి? తమ ఆవేదనను ఎలా బహిర్గతం చేయాలనే దానిపైనే అందరూ ఆలోచనలో ఉన్నారని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ఆలోచించే వారే నిజమైన నాయకులని వెల్లడించారు. 74 ఏళ్ల వయసులో ఉన్న చంద్రబాబును అరెస్టు చేసి జైల్లో పెట్టినందుకు ప్రతి ఒక్కరూ ఆగ్రహంతో ఉన్నారని పేర్కొన్నారు. ఏ రోజునా కూడా బయటకు రాని మహిళలు చంద్రబాబు కోసం బయటకు వచ్చి తమ నిరసన గళాన్ని వినిపిస్తున్నారని మురళీ మోహన్ తెలియజేశారు. హైదరాబాద్ ఇంతలా అభివృద్ధి చెందడానికి ముఖ్య కారణం చంద్రబాబే అని వెల్లడించారు. అభివృద్ధి గురించి ఆలోచించే వ్యక్తికి ఇలాంటి పరిస్థితి రావడం శోచనీయమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు ఇది గ్రహణంలాంటి పరిస్థితి అని పేర్కొన్నారు. గ్రహణం విడిచిన తర్వాత ఆయన కడిగిన ముత్యంలా బయటకు వస్తారని మురళీ మోహన్ ఆశాభావం వ్యక్తం చేశారు.
Motkupalli on Chandrababu Arrest : సీఎం జగన్ పాలనకు చరమగీతం పాడే సమయం దగ్గరపడింది : మోత్కుపల్లి
రాజకీయ నాయుకుడు, ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలాంటి సేవా కార్యక్రమాలు చేశారనేది ప్రజలందరికీ తెలుసని నిర్మాత కె.ఎల్.దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబు ఎప్పుడూ భవిష్యత్తు తరాల కోసంఆలోచించేవారని తెలిపారు. 1995-1997 మధ్యకాలంలో హైటిక్ సిటీ నిర్మాణానికి ముందు అక్కడి పరిస్థితులు దారుణంగా ఉండేవని... చంద్రబాబు ఎంతో ముందుచూపుతో దాని రూపురేఖలు మార్చారని వెల్లడించారు. ఆయన వేసిన బాటలో ఎంతోమంది ఉన్నత స్థానాలు అధిరోహించారని దామోదర ప్రసాద్ పేర్కొన్నారు. చంద్రబాబు కుటుంబానికి తాము ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటామని తెలిపారు. అందులో ఎలాంటి సందేహం లేదని. ఇప్పటికైనా ఆయన్ని విడుదల చేయాలని దామోదర ప్రసాద్ డిమాండ్ చేశారు.
మేము సినిమా వాళ్లం ముఖానికి రంగులు వేస్తాం.. కానీ, శ్మశానానికి రంగులు వేయమని రవికుమార్ చౌదరి పేర్కొన్నారు. మేము సినిమా వాళ్లం శరీరానికి మేకప్ వేయిస్తాం కానీ డెడ్ బాడీకి మేకప్ చేయించమని ఎద్దేవా చేశారు. మేము అంత నిజాయతీగా ఉంటామని పేర్కొన్నారు. కుల మతాలకు అతీతంగా సినిమా పరిశ్రమ మొత్తం ‘వీ ఆర్ విత్ సీబీఎన్’ అని చెప్పడం కోసమే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు రవికుమార్ చౌదరి తెలిపారు. కేసులకు భయపడమని... ధైర్యంగా ఉంటాం, అభివృద్ధి కోసం పోరాడతాం, అభివృద్ధికే ఓటు వేస్తామని రవికుమార్ చౌదరి వెల్లడించారు. చంద్రబాబుతో తమకు సత్సంబంధాలున్నాయని చిత్రపురి హిల్స్, ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షులు అనిల్ కుమార్ అన్నారు. చంద్రబాబుకు జరిగింది అన్యాయం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఏదేమైనా న్యాయమే గెలుస్తుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.