TDP National General Secretary Nara Lokesh fire on CM Jagan: పులివెందులలో తెలుగుదేశం పార్టీ గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదని.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి కార్యకర్తలంతా సైనికుల పని చేయాలని పిలుపునిచ్చారు. నాయకులు ఎటువంటి మనస్పర్ధలు లేకుండా కలిసికట్టుగా పని చేయాలన్న యువనేత.. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులకు కూడా నీరు, సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామన్నారు.
120వ రోజుకు చేరుకున్న లోకేశ్ పాదయాత్ర.. తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన 'యువగళం' పాదయాత్ర నేటితో 120వ రోజుకు చేరుకుంది. ఈ 120వ రోజు పాదయాత్రను ఆయన కడప జిల్లాలో ప్రారంభించారు. పాదయాత్రలో భాగంగా యువనేత లోకేశ్.. న్యాయవాదులతో, పులివెందుల పార్టీ కార్యకర్తలతో ముఖాముఖి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సమస్యలను, సవాళ్లను, వారి డిమాండ్లను తెలుసుకున్న ఆయన.. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదుల కోసం ఏయే పథకాలు ప్రవేశపెట్టనున్నారో..?, ఎక్కడెక్కడ కోర్టులు ఏర్పాటు చేయనున్నారో..?, న్యాయవాదులు మరణిస్తే ఆ కుటుంబానికి ఎంత సాయం చేయనున్నారో..? వంటి వివరాలను వెల్లడించారు. అనంతరం పార్టీ కోసం నిజాయితీగా పని చేసిన వారికే సీట్లు ఇస్తామని యువనేత లోకేశ్ ప్రకటించారు.
వేలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు.. యువగళం పాదయాత్రలో భాగంగా ఈరోజు నారా లోకేశ్ పులివెందులలో పర్యటించారు. ఈ పర్యటనకు పులివెందుల టీడీపీ ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా నారా లోకేశ్ మాట్లాడుతూ.. పులివెందులలో గెలవకపోయినా ఎప్పుడూ చిన్న చూపు చూడలేదన్నారు. అన్ని నియోజకవర్గాల లాగే పులివెందులను కూడా అభివృద్ది చేశామన్నారు. పులివెందులకు టీడీపీ..నీరు ఇచ్చింది, సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసిందన్నారు. దీంతోపాటు రాజకీయ అవకాశాలను కూడా ఎక్కువగా కల్పించామన్నారు.
అటువంటివారికే వారికే పదవులు ఇస్తాం.. జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో పులివెందుల ప్రజలు కూడా బాధితులేనని నారా లోకేశ్ వ్యాఖ్యానించారు. 90 వేల మెజారిటీతో జగన్‌ను పులివెందుల ప్రజలు గెలిపించినందుకు.. పులివెందులకు జగన్ ఏం చేశాడు..?, జయంతిలకు, వర్ధంతిలకు రావడం తప్ప.. జగన్ పులివెందులకు చేసింది ఏంటి? అని ఆయన ప్రశ్నించారు. అనంతరం సీనియర్, జూనియర్లను సమానంగా గౌరవిస్తామన్న ఆయన.. పార్టీ కోసం పని చేసే వారికే పదవులు ఇస్తామని ప్రకటించారు. నాయకులు అందరూ నియోజకవర్గంలో అందుబాటులో ఉండాలని, కేసులకు భయపడి ఇంట్లోనే ఉంటామంటే ప్రజలు హర్షించరని గుర్తు చేశారు. పోరాడిన వారికే ప్రజల మద్దతు ఉంటుందనీ నారా లోకేష్ సూచించారు.
ఇంఛార్జ్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయించాం..!.. పులివెందులకు చెందిన పార్టీ నేతలకు ఎమ్మెల్సీ పదవులు ఇచ్చి గౌరవించామని.. లోకేశ్ గుర్తు చేశారు. ఒడిపోయినా ఇంఛార్జ్‌గా ఉండి పెత్తనం చెయ్యాలనుకుంటే ఇకపై కుదరదని..ఇంఛార్జ్ వ్యవస్థను రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆయన స్పష్టంచేశారు. టీడీపీ నాయకుల్ని, కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి సర్వీస్ నుండి తొలగిస్తామని నారా లోకేశ్ తెలియజేశారు. ఢీ అంటే ఢీ అనే వాళ్ళనే తాను గుర్తిస్తానని మరోమారు ఆయన తేల్చి చెప్పారు.
జగన్ వచ్చాడు..అన్ని వ్యవస్థల్ని నాశనం చేశాడు.. నారా లోకేశ్ మాట్లాడుతూ.. జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన రోజు నుంచి రాష్ట్రంలోని అన్ని వ్యవస్థల్ని నాశనం చేశారని ఆరోపించారు. జగన్ పాలనలో న్యాయవాదులూ బాధితులేనన్న ఆయన.. ఇటీవలే లాయర్లపైనా దాడులు చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవాదులకు అనేక హామీలు ఇచ్చిన జగన్.. ఒక్క హామీ నిలబెట్టు కోలేదన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులకు ప్రత్యేక రక్షణ చట్టం తీసుకొస్తామని, కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని నారా లోకేశ్ స్పష్టం చేశారు.
జగన్.. రాజకీయ లబ్ది కోసమే చిచ్చు పెట్టాడు.. అనంతరం రాజకీయ లబ్ది కోసమే జగన్ మోహన్ రెడ్డి ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాడనీ నారా లోకేశ్ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత న్యాయవాదుల సమస్యలను పరిష్కరించటమే కాకుండా, వారి డిమాండ్లను ఒక్కోక్కటిగా నేరువేరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. నేషనల్ లా కాలేజ్‌ను కర్నూలు జిల్లాలో ఏర్పాటు చేయాలని ఆనాడు టీడీపీ అనుకుంటే దానిని జగన్ రెడ్డి అమరావతికి తరలించాడని గుర్తుచేశారు.
''కోర్టుల విషయానికొస్తే.. ఎంత దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయో నేను స్వయంగా చూశాను. కనీసం కూర్చోడానికి కుర్చీలు, బాత్ రూంలు కూడా లేవు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయశాఖకు అధిక నిధులు కేటాయించి.. నూతన భవనాలు, మౌలిక వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. న్యాయవాదులు చనిపోతే వారి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్ధిక సాయాన్ని అందిస్తాం. దాంతో న్యాయవాదులకు హెల్త్ కార్డులు కూడా అందిస్తాం. నాణ్యమైన ఇళ్లను కట్టించి న్యాయవాదులకు ఇస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయవాదులపై ప్రొఫెషనల్ ట్యాక్స్ భారం పడకుండా చేస్తాం. టీడీపీ లీగల్ సెల్‌ని బలోపేతం చేస్తున్నాం. ఇప్పుడు కష్టపడిన వారికి ఖచ్చితంగా పదవులు ఇస్తాం. నామినేటెడ్ పదవులు కూడా న్యాయవాదులకి ఇస్తాం. చట్టాన్ని అతిక్రమించి న్యాయవాదులపై కేసులు పెట్టిన అధికారులపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేసి చర్యలు తీసుకుంటాం.''- నారా లోకేశ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
ఇవీ చదవండి