Telangana New CM Revanth Reddy Swearing Ceremony Today : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మిత్రపక్షాలతో కలిసి 65 సీట్లతో జయభేరి మోగించిన కాంగ్రెస్.. ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. డిసెంబరు 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉంటుందని గతంలో పలు సందర్భాల్లో రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే అంతకంటే ముందే ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించారు.
హైదరాబాద్‌లో మకాం వేసిన కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల పరిశీలకురాలు దీపాదాస్‌మున్షీ, ఇంఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (PCC President Revanth Reddy), ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ మల్లురవి తదితరులు ఆదివారం రాత్రికే ఎన్నికైన ఎమ్మెల్యేలతో సమావేశం కావాలని నిర్ణయించారు. అయితే ఎమ్మెల్యేలందరూ చేరుకోవడానికి సమయం పట్టడంతో ఇవాళ సీఎల్పీ సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
Congress Government Formation in Telangana Today : ఈ సమావేశానికి డీకే శివకుమార్, బోసురాజు, అజయ్‌కుమార్, జార్జ్, దీపాదాస్‌మున్షీలు పరిశీలకులుగా హాజరవుతారు. ఎమ్మెల్యేలతో మాట్లాడిన తర్వాత సీఎల్పీ చేసిన తీర్మానాన్ని కాంగ్రెస్ అధిష్ఠానానికి పంపిస్తారు. అక్కడి నుంచి వచ్చే సీఎం పేరును ఎమ్మెల్యేలకు చెప్పి అనంతరం గవర్నర్‌ను కలిసి అందజేస్తారు. మరోవైపు ఎన్నికల సంఘం సీఈఓ వికాస్‌రాజ్ ఇవాళ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను (Governor Tamilisai Soundara Rajan) కలిసి గెలిచిన ఎమ్మెల్యేల జాబితాను సమర్పిస్తారు. ప్రస్తుత అసెంబ్లీని రద్దు చేస్తూ గవర్నర్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ కార్యక్రమం ఉంటుంది.
కాంగ్రెస్ పార్టీకి జోష్ తీసుకొచ్చి - అన్నీ తానై వన్ మ్యాన్ ఆర్మీ షో
సీఎం ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారా లేక ఇంకెవరైనా ఉంటారా అన్నది సోమవారం తేలనుంది. ప్రమాణ స్వీకారానికి అగ్రనేతలు మలికార్జున ఖర్గే, రాహుల్‌గాంధీ (Rahul Gandhi), ప్రియాంక హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం రాత్రి గవర్నర్ తమిళిసై సౌందర రాజన్‌ను కలిసిన కాంగ్రెస్ బృందం.. మెజార్టీ సాధించిన తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరింది. ముఖ్యమంత్రి పదవికి భట్టి విక్రమార్క (CLP Leader Bhatti Vikramarka) సహా పలువురు నేతలు పోటీ పడుతున్నారు.
ఇవాళ్టి సీఎల్పీ సమావేశం తర్వాతే ముఖ్యమంత్రి పేరు ప్రకటిస్తామని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, ఏఐసీసీ పరిశీలకుడు డీకే శివకుమార్ (DK Shivakumar) స్పష్టంచేశారు. కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థులు బస చేసే గచ్చిబౌలి ఎల్లా హోటల్ వద్ద పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
"గవర్నర్‌ను కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పాం. మాకు 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పాం. సోమవారం ఉదయం సీఎల్పీ సమావేశం నిర్వహిస్తాం. కాంగ్రెస్ పార్టీలో ఒక విధానం ఉంటుంది. ఆ విధానం ప్రకారమే ముందుకు వెళ్తాం." -డీకే శివకుమార్, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి