టెక్విగోర్ విత్ రాపుంజెల్ సిండ్రోమ్(Rapunzel Syndrome)... ఇదో అరుదైన మానసిక వ్యాధి. ఈ సిండ్రోమ్ ఉన్నవారు వెంట్రుకలను, దారాలను తింటూ ఉంటారు. ఉత్తర్‌ప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో నాలుగేళ్ల వయసున్న ఓ చిన్నారి ఈ వ్యాధితో(Rapunzel Syndrome) బాధపడుతోంది. అయితే.. అక్కడి వైద్యులు శస్త్రచికిత్స చేసి, ఆమెను రక్షించారు. చిన్నారి కడుపులో నుంచి 400 గ్రాముల వెంట్రుకలను సర్జరీ చేసి బయటకు తీశారు.
అసలేమైంది?
సెప్టెంబర్ 1న అహిమా అనే చిన్నారికి కడుపు నొప్పి రావడం వల్ల.. తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆమెను పరీక్షించిన వైద్యులు.. కడుపులో వెంట్రుకల చుట్ట ఉన్నట్లు గుర్తించారు. ఆమెకు పిల్లల వైద్య నిపుణుడు డాక్టర్ ధనేశ్ అగ్రహారీ నేతృత్వంలోని వైద్య బృదం.. శస్త్రచికిత్స నిర్వహించింది.
"ఇది నాకు కొత్త అనుభవం. సహజంగా ఇలాంటి వ్యాధి 16 ఏళ్ల పై వయుసు అమ్మాయిల్లో కనిపిస్తుంది. సీటీ స్కాన్ అల్ట్రాసౌండ్ పరీక్షల ద్వారా... ఆమె కడుపులో వెంట్రుకలు ఉండ, దారాలు ఉన్నట్లు గుర్తించాం. అవి రెండు అడుగుల పొడవు ఉన్నాయి. వాటిని క్లిష్టమైన శస్త్రచికిత్స ద్వారా తొలగించాం."
-ధనేశ్ అగ్రహారీ, వైద్యుడు.
సాధారణంగా ఈ వ్యాధి(Rapunzel Syndrome) మానసకి స్థితి సరిగా లేని వారిలో కనిపిస్తుంది. కానీ, మానసిక స్థితి బాగానే ఉన్న చిన్నారిలో ఈ వ్యాధి కనిపించడం ఇదే తొలిసారి అని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం అహిమా ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, ఆమెను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసినట్లు పేర్కొన్నారు.
"ఇంట్లో అహిమా ఆడుకునే సమయంలో.. కింద పడ్డ వెంట్రుకలను తింటూ ఉండేది. బయట ఆడుతున్నప్పుడు వెంట్రుకలు, దారాలను తింటూ ఉండేది. దాని వల్ల ఆమె వాంతులు, కడుపు నొప్పితో బాధపడేది. ఆ తర్వాత మేం వైద్యులను సంప్రదించాం" అని అహిమా తల్లి చెప్పారు.
ఏంటీ రాపుంజెల్ సిండ్రోమ్?
టెక్విగోర్ విత్ రాపుంజెల్ సిండ్రోమ్ అనేది ఓ అరుదైన మానసిక వ్యాధి. ఈ వ్యాధితో బాధపడే వారు మానవుల వెంట్రుకలను తింటూ ఉంటారు. దానివల్ల వారి కడుపుల్లో ఓ వెంట్రుకల ఉండగా పేరుకుపోతాయి. ఈ రాపుంజెల్ సిండ్రోమ్‌లో పలు రకాలు ఉంటాయి. ట్రికోఫాగియా రాపుంజెల్ వ్యాధితో బాధపడే వారు.. వారి సొంత వెంట్రుకలను వారే తింటారు. ఇక ట్రికోటిల్లోమానియా, పికా వంటి రకాలు కూడా ఉంటాయి. ఈ సిండ్రోమ్ ఉన్నవారు ఆహారం కాకుండా బట్టలు, ఉన్ని, వెంట్రుకలు వంటివి తింటూ ఉంటారు.
ఇదీ చూడండి: తెలుగు మహిళకు జాతీయ ఫ్లోరెన్స్ నైటింగెల్ అవార్డు