కరోనా మహమ్మారి.. (Corona Virus) ఆరోగ్యం నుంచి విద్యావ్యవస్థ వరకు అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని తరగతుల వారికి మాత్రమే పాఠశాలలు తెరవడం వల్ల మిగతా క్లాసుల వారికి ప్రభుత్వం నిర్వహించే ఆన్‌లైన్ తరగతులే (Online Classes) ఆధారమయ్యాయి. అయితే పేద కుటుంబాలు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన పిల్లలకు ఆన్‌లైన్ (Online Classes) సదుపాయం లేకపోవటం వల్ల వారంతా చదువుకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో ఓ వ్యక్తి.. నిరుపేద విద్యార్థులకు అండగా నిలిచారు. ఏకంగా సొంత డబ్బుతో 32 అంగుళాల టీవీ కొని.. విద్యను (Online Education) వారి చెంతకే తీసుకొని వెళ్లారు ఆ ఉపాధ్యాయుడు. ఆయనే తమిళనాడు మైలాదుతురై జిల్లా నిమేలీ- నేపతుర్ పంచాయతీలోని పాఠశాలలో పనిచేస్తున్న శ్రీనివాసన్.
వీల్‌ఛైర్ టీవీ...
శ్రీనివాసన్ టీవీతో పాటు స్పీకర్లు, ఇంటర్నెట్ మోడెమ్, పెన్‌డ్రైవ్‌లను సొంత ఖర్చులతో కొనుగోలు చేశారు. వీటిని ఓ వీల్‌ఛైర్‌లో అమర్చేలా రూపొందించారు. దీంతో సులభంగా గ్రామాలకు తీసుకెళుతున్నారు. ఒకటో తరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు ఉన్న పేద విద్యార్థులకు జరిగే పాఠాలను అందులో వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. వారి సందేహాలకు జవాబులు చెబుతూ.. హోం వర్క్ కూడా ఇస్తున్నారు.
కరోనా జాగ్రత్తలతో..
విద్యార్థుల వద్దకే విద్యను తీసుకెళ్లిన శ్రీనివాసన్.. కరోనా జాగ్రత్తలను తాను పాటించడమే కాకుండా.. విద్యార్థులు కూడా పాటించేలా జాగ్రత్తలు తీసుకున్నారు. తరగతులకు హాజరయ్యే విద్యార్థులు ముఖానికి మాస్కులు ధరించి వస్తున్నారు. ఉపాధ్యాయుడు శ్రీనివాసన్ చేస్తున్న ఈ పని.. పిల్లల తల్లిదండ్రులు ఎంతగానో మెచ్చుకుంటున్నారు.
ఇదీ చూడండి: ఉత్తరాల పంపిణీకి పోస్ట్ఉమన్ ఎగనామం- ఇంట్లో సంచులకొద్దీ...