TDP Nara Lokesh Yuvagalam Padayatra: తెలుగుదేశం ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ యువగళం పాదయాత్ర 3వేల కిలోమీటర్ల మైలురాయిని అధిగమించింది. 3వేల కిలోమీటర్ల పాదయాత్రకు గుర్తుగా కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట సమీపంలోని రాజులకొత్తూరు వద్ద లోకేశ్ పైలాన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బ్రాహ్మణి, మోక్షజ్ఞ, దేవాన్ష్పాల్గొన్నారు.
కుటుంబ సభ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలతో కలిసి లోకేశ్ ముందుకు సాగారు. 219వ రోజు ఆదివారం 16.3 కి.మీ నడిచిన లోకేశ్ ఇప్పటివరకు 3,006.7 కిలోమీటర్లు ప్రజలతో కలిసి సాగారు. తుని నియోజకవర్గం రాజుల కొత్తూరు వద్ద పైలాన్‌ను సోమవారం ఆవిష్కరించారు. జనవరి 27న కుప్పంలో ప్రారంభమైన పాదయాత్రకు ప్రభుత్వం, వైసీపీ నాయకుల నుంచి అవరోధాలు ఎదురైనా లోకేశ్ ప్రజాగళం వినిపిస్తూ ముందుకు సాగారు.
నిరుద్యోగులకు హామీ ఇస్తున్నాం-పెద్దఎత్తున పరిశ్రమలు తెస్తాం, ఉద్యోగాలు కల్పిస్తాం: నారా లోకేశ్
పది ఉమ్మడి జిల్లాల్లో 92 నియోజకవర్గాల మీదుగా సాగిన యాత్రకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని మలికిపురం మండలం దిండి వద్ద సెప్టెంబరు 8న యాత్ర ప్రవేశించింది. తర్వాత రోజు చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో పాదయాత్ర 79 రోజులపాటు ఆగింది. గత నెల 26న యాత్ర పునఃప్రారంభించారు. లోకేశ్ పాదయాత్రకు అన్నివర్గాలూ పాదయాత్రకు నీరాజనం పలికాయి.
యువగళం యాత్ర ప్రారంభమైనప్పటి నుంచీ యువనేత లోకేశ్‌కు ఎరుపు రంగు టీషర్టు ధరించిన 100 మంది వాలంటీర్లే రక్షణ కవచంగా నిలిచారు. వివిధ జిల్లాలకు చెందిన వీరంతా బీటెక్, డిగ్రీ పీజీలు చేసిన యువకులు. టీడీపీ రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి రవినాయుడు పర్యవేక్షణలో సేవలందిస్తున్నారు.
లోకేశ్ యువగళం పాదయాత్రకు మద్దతుగా 3 వేల ఆటోలతో ర్యాలీ
అనివార్యమైన సందర్భాల్లో మినహా యువగళం పాదయాత్రకు ఏనాడూ విరామం ప్రకటించలేదు. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అధినేత చంద్రబాబు అరెస్ట్ కావడంతో సెప్టెంబర్ 9న కోనసీమ జిల్లాలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ వద్ద లోకేశ్ పాదయాత్రకు 79 రోజుల పాటు తాత్కాలిక విరామం ప్రకటించాల్సి వచ్చింది. అధికార పార్టీ వైఫల్యాలు, అవినీతిని యువనేత లోకేశ్ మాటల తూటాలతో ప్రజాక్షేత్రంలో ఎండగట్టిన తీరు అందరినీ ఆకట్టుకుంది.
219రోజుల పాదయాత్రలో యువనేత లోకేశ్‌కు 4 వేలకు పైగా వినతిపత్రాలు అందగా, లక్షలాది ప్రజలు నేరుగా కలుసుకొని తమ సమస్యలు చెప్పుకున్నారు. యువగళం పాదయాత్రలో దాదాపు కోటిమంది ప్రజలు యువనేతతో వివిధ మార్గాల్లో అనుసంధానమయ్యారు. యువగళం సందర్భంగా ప్రతిజిల్లాలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమాలకు అనూహ్య స్పందన లభిస్తోంది. ఇప్పటివరకు మరే ఇతర జిల్లాల్లో లేనివిధంగా గుంటూరు జిల్లాలో 3చోట్ల యువనేత లోకేశ్ ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మొత్తం ఇప్పటివరకు నిర్వహించిన 12 ప్రత్యేక కార్యక్రమాలకు ప్రజల నుంచి పెద్దఎత్తున స్పందన లభించింది.