రాజస్థాన్‌కు చెందిన మురారీ లాల్ అనే వ్యక్తికి ట్యాక్స్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. రూ.5 కోట్ల మోసానికి పాల్పడ్డాడని పేర్కొంటూ అరెస్టు చేసేందుకు ఇంటి ముందు వాలిపోయారు. ఎనిమిదో తరగతి వరకు మాత్రమే చదువుకొని, ఓ మారుమూల గ్రామంలో పశువుల కాపరిగా పనిచేస్తున్న మురారీ లాల్‌కు.. అధికారుల మాటలు విని గుండె ఆగినంత పనైంది. గతంలో జరిగిన పరిణామాలను మురారీ లాల్ గుర్తు తెచ్చుకునే సరికి జరిగిందంతా అవగతమైంది. తనను వేరే వ్యక్తి మోసం చేశాడని అర్థమైంది.
గతంలో ఓ స్టూడియోలో పనిచేసే సమయంలో మురారీ లాల్‌కు ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. సొంతంగా వ్యాపారం పెట్టుకునేందుకు సహాయం చేస్తానని అతడు మురారీ లాల్‌కు హామీ ఇచ్చాడు. నెల రోజుల తర్వాత అదే వ్యక్తి ఫోన్ చేసి లోన్ ఇప్పిస్తానంటూ ఆధార్, పాన్, బ్యాంక్ స్టేట్మెంట్ వంటి వివరాలను తీసుకున్నాడు.
వీటిని ఇవ్వగానే తనకు ఆ వ్యక్తి నుంచి ఫోన్లు రావడం ఆగిపోయాయని మురారీ లాల్ 'ఈటీవీ భారత్'తో వాపోయాడు. తన పేరు మీదనే కోట్లలో టర్నోవర్ ఉన్న కంపెనీ నమోదై ఉందని ఇప్పుడు తెలిసిందని చెప్పాడు. మురారీ లాల్ పేరు మీద నమోదైన కంపెనీ పేరిట గుర్తుతెలియని ఆ వ్యక్తి మోసాలకు పాల్పడినట్లు తెలుస్తోంది.
'పాపం మంచోడే!'
ఈ విషయంపై స్థానికులను 'ఈటీవీ భారత్' ఆరా తీయగా.. మురారీ లాల్‌కు మద్దతుగా నిలిచారు. బాధితుడు మూడు దశాబ్దాల నుంచి గ్రామంలోనే ఉంటున్నాడని చెప్పారు. ప్రస్తుతం గోశాలలో పనిచేస్తున్నాడని స్పష్టం చేశారు. అనంతరం పన్ను అధికారులు సైతం ఇదే విషయాన్ని ధ్రువీకరించారు. మురారీ లాల్ బాధితుడేనని చెప్పారు. అసలైన నిందితుడిని గుర్తించేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: తీవ్రస్థాయి కొవిడ్ రోగుల పాలిట సంజీవని!