తమిళనాడు అంటే.. టక్కున గుర్తొచ్చే ఆహార పదార్థం ఇడ్లీ సాంబార్. అయితే.. ఇటీవల చాలా మంది ఇడ్లీలను కాదని ఫాస్ట్‌ఫుడ్‌కు అలవాటు పడుతున్నారు. అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో.. ఇడ్లీ తింటే కలిగే ప్రయోజనాలపై అవగాహన కలిగించేలా 'ఇడ్లీ తినే పోటీ'ని(Idli eating competition) నిర్వహించింది ఓ హోటల్ యాజమాన్యం. ఈ పోటీలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులు.. కేవలం 3 నిమిషాల్లో 19 ఇడ్లీలు తిని, అందరినీ ఆశ్చర్యపరిచారు.
ఈరోడ్ జిల్లా(Tamil nadu erode news) కడయంపట్టి ప్రాంతంలో పట్టాయ కేటరింగ్ యాజమాన్యం ఈ 'ఇడ్లీ' పోటీని(Idli eating competition) నిర్వహించింది. ఇడ్లీలు తింటే ఎలాంటి అనారోగ్యానికి గురికారని చెప్పేందుకే తాము ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని వారు తెలిపారు. తమిళ కమెడియన్ వైయాపురి ఈ కార్యక్రమానికి హాజరై పోటీని ప్రారంభించారు.
వేగంగా తిన్నవారే విజేత..
ఇందులో పాల్గొనేవారికి కొన్ని నిబంధనలు విధించారు నిర్వాహకులు. 10 నిమిషాల గడువులో ఎక్కువ ఇడ్లీలు తినాలి. తిన్న తర్వాత 5 నిమిషాల వరకు వాంతి చేసుకోకూడదు. 19-30 ఏళ్ల వయసు వారు, 31-40 ఏళ్ల వయసు వారు, 41-50 ఏళ్ల వయసు వారిని గ్రూపులుగా విభజించి ఈ పోటీని నిర్వహించారు. ప్రతి గ్రూపులో 25 మంది వరకు పాల్గొని, ఇడ్లీలు తిన్నారు.
3 నిమిషాల్లోనే 19 ఇడ్లీలు తిని..
31-40 ఏళ్ల వయసు గ్రూపులో కుమార పాలయం ప్రాంతానికి చెందిన రవి, 41-50 ఏళ్ల వయసు గ్రూపులో భవానీ ప్రాంతానికి చెందిన రామలింగం.. కేవలం 3 నిమిషాల్లోనే 19 ఇడ్లీలను ఆరగించారు. పోటీలో పాల్గొన్న మిగతావారెవరూ కూడా 10 నిమిషాల్లో 19 ఇడ్లీలను తినలేకపోయారు. దాంతో వీరిద్దరూ ప్రథమ విజేతలుగా నిలిచారు.
ప్రతి గ్రూపులో ప్రథమ విజేతగా నిలిచిన వారికి రూ.5,000, రెండో విజేతకు రూ.3,000, మూడో విజేతకు రూ. 2,000, నాలుగో విజేతకు రూ.1,000 చొప్పున నగదు బహుమతులను నిర్వాహకులు అందించారు. జిల్లా డీఎస్పీ షణ్ముగం ఈ కార్యక్రమానికి హాజరైన విజేతలకు బహుమతులు అందజేశారు. ప్రజలంతా సహజ ఆహార పదార్థాలనే తినాలని ఆయన కోరారు.
ఇదీ చూడండి: రెండు వర్గాల మధ్య ఘర్షణ.. ఒకరిపై ఒకరు రాళ్లురువ్వుకుని..