ఓ వ్యక్తిని ఎవరైనా కిడ్నాప్ చేసి వేధింపులకు గురిచేయకపోయినా, హత్య చేస్తానని బెదిరించకపోయినా, సదరు వ్యక్తిని బాగా చూసుకున్నా.. ఆ కిడ్నాపర్‌కు ఐపీసీ సెక్షన్ 364ఏ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష విధించేందుకు ఆస్కారం లేదని సుప్రీం కోర్టు తెలిపింది. ఈ మేరకు జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ ఆర్ సుభాశ్ రెడ్డితో కూడిన ధర్మాసనం పేర్కొంది. తెలంగాణకు చెందిన ఓ ఆటోడ్రైవర్.. దాఖలు చేసిన వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
ఏంటీ కేసు?
సికింద్రాబాద్ సెయింట్ మేరీ హైస్కూల్‌కు చెందిన ఆరో తరగతి చదివే ఓ విద్యార్థి(13)ని 2011లో అహ్మద్ అనే ఆటోడ్రైవర్ కిడ్నాప్ చేశాడు. విద్యార్థి తండ్రి నుంచి రూ.2లక్షలు డిమాండ్ చేశాడు. అయితే.. పోలీసులు ఆ బాలుడిని కాపాడారు. అనంతరం ఈ కేసు విచారణలో తనను కిడ్నాపర్ ఎలాంటి హాని చేయలేదని తెలంగాణ హైకోర్టులో సదరు బాధితుడు, బాధితుడి తండ్రి తెలిపారు. అయినప్పటికీ.. ఐపీసీ 364ఏ సెక్షన్ కింద హైకోర్టు అహ్మద్‌కు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అయితే.. దీన్ని సవాలు చేస్తూ సుప్రీం కోర్టును అహ్మద్ ఆశ్రయించాడు.
సెక్షన్ 364ఏ కింద శిక్ష విధించేందుకు మూడు ముఖ్యమైన నిబంధనలు ఉన్నాయని సుప్రీంకోర్టు ధర్మాసనం పేర్కొంది. డబ్బుల కోసమే కిడ్నాప్ చేశాడనడానికి ఆధారాలు ఉన్నందున సెక్షన్ 363(కిడ్నాప్ చేసినందుకు శిక్ష) కింద మాత్రమే శిక్షకు అర్హుడవుతాడని చెప్పింది. ఈ సెక్షన్ కింద అప్పీలుదారుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.5,000 జరిమానా విధించటం సహేతుకమని తెలిపింది.
ఇదీ చూడండి: బడుగులపై దాడులు- మారాలి పోలీసు ధోరణి
ఇదీ చూడండి: 'ఫిరాయింపులపై పార్లమెంటుకే పూర్తి అధికారాలు'