Maharashtra political crisis: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ శిందే వర్గానికి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. శిందే వర్గంలోని ఎమ్మెల్యేలపై జులై 11 వరకు అనర్హత వేటుపై ఎలాంటి నిర్ణయం తీసుకోద్దని డిప్యూటీ స్పీకర్‌కు అత్యున్నత ధర్మాసనం సూచించింది. రెబల్ ఎమ్మెల్యేల వర్గంలోని మొత్తం 39 మందితో పాటు వారి కుటుంబసభ్యులు, ఇళ్లు, ఆస్తులకు రక్షణ కల్పించాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే డిప్యూటీ స్పీకర్ పంపిన నోటీసులకు జులై 11 సాయంత్రం ఐదున్నరలోగా సమాధానం చెప్పాలని రెబల్ ఎమ్మెల్యేలకు సూచించింది. తదుపరి విచారణను జులై 11కు వాయిదా వేసింది.
విశ్వాస పరీక్షపై.. మహారాష్ట్ర అసెంబ్లీలో ఎలాంటి విశ్వాస పరీక్షలకు జరగకుండా ఆదేశాలు జారీ చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం వినతిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనిపై తాము ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయలేమని స్పష్టం చేసింది. అయితే చట్టవిరుద్ధంగా ఏం జరిగినా న్యాయస్థానాన్ని వెంటనే ఆశ్రయించవచ్చని చెప్పింది.
Shiv sena news: మహారాష్ట్ర డిప్యూటీ స్పీకర్ తమపై అనర్హత వేటు వేస్తానంటూ నోటీసులు పంపడాన్ని సవాల్ చేస్తూ ఏక్నాథ్ శిందే సారథ్యంలోని శివసేన రెబల్ ఎమ్మెల్యేలు సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మొదట హైకోర్టును ఆశ్రయించకుండా.. నేరుగా సుప్రీంకోర్టుకు ఎందుకు వచ్చారని శిందే తరఫు లాయర్‌ను ప్రశ్నించింది. దీనికి ఆయన స్పందిస్తూ.. ప్రస్తుత శివసేన ప్రభుత్వం మైనారిటీలో ఉందని, తమ ఎమ్మెల్యేలకు బెదిరింపులు వస్తున్న కారణంగానే ముంబయిలో కాకుండా గువాహటిలో ఉన్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ స్పీకర్‌ను తొలగించాలనే పిటిషన్‌పై విచారణ జరగుతుండగానే.. ఆయన ఎమ్మెల్యేకు అనర్హత వేటు నోటీసులు పంపడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. గతంలో అరుణాచల్ ప్రదేశ్ నాబం రేబియా కేసు విషయాన్ని ప్రస్తావించారు.
Supreme Court: వాదోపవాదనలు విన్న అత్యున్నత ధర్మాసనం.. దీనిపై స్పందన తెలియజేయాలని మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, కార్యదర్శి, కేంద్రంతో పాటు శివసేన నాయకులు అజయ్ చౌదరి, సనీల్ ప్రభుకు నోటీసులు పంపింది. ఐదు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని అదేశించింది.
శిందేతో పాటు మరో 15 మంది శివసేన రెబల్ ఎమ్మెల్యేలకు శనివారం అనర్హత వేటు నోటీసులు జారీ చేశారు మహారాష్ట్ర అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ నరహరి జిర్వాల్. 48 గంటల్లోగా(సోమవారం నాటికి) స్పందన తెలపాలని కోరారు. దీన్ని సవాల్ చేస్తూ ఏక్నాథ్ శిందే.. సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇది రాజ్యాంగ విరుద్ధమని పిటిషన్లో పేర్కొన్నారు. తనకు 38మంది శివసేన ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపారు. ప్రస్తుతం మహావికాస్ అఘాడీ ప్రభుత్వం మైనారిటీలో ఉందని వాదించారు.
మంత్రులపై వేటు.. శిందేతో పాటు ఆయన వర్గంలోని 9 మంది మంత్రి పదవులను సీఎం ఠాక్రే తొలగించారు. కేబినెట్‌ను పునరుద్ధరించి వారి శాఖలను తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలకు కేటాయించారు. శిందేతో పాటు గువాహటిలో ఉన్న మంత్రుల్లో గులాబ్ రావ్ పాటిల్, దాదా భుసే, సందీపన్ భుమ్రే, ఉదయ్ సామంత్ వంటి వారున్నారు. వీరంతా ప్రస్తుతం గువాహటిలో శిందేతో పాటు హోటల్లో ఉన్నారు.
ఇదీ చదవండి: సంజయ్ రౌత్‌కు ఈడీ సమన్లు.. టైమ్ లేదన్న శివ సైనిక్!