పార్లమెంటు గతవారం ఆమోదించిన ట్రైబ్యునళ్ల సంస్కరణల బిల్లుపై సుప్రీంకోర్టు సోమవారం కీలక వ్యాఖ్యలు చేసింది. కోర్టు కొట్టేసిన నిబంధనలను యథాతథంగా జొప్పించి బిల్లు ఎందుకు తెచ్చారని ప్రశ్నించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ, జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ అనిరుద్ధ బోస్‌లతో కూడిన ధర్మాసనం సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను దీనిపై సూటి ప్రశ్నలు వేసింది.
"కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, కోర్టు కొట్టేసిన నిబంధనలను మళ్లీ బిల్లు రూపంలో తెచ్చారు. దీనిపై పార్లమెంటులో చర్చలు జరిగినట్లు కూడా నేను చూడలేదు. శాసనాలు చేసే విశేషాధికారం చట్టసభలకు ఉంది. అందువల్ల పార్లమెంటు కార్యకలాపాలపై వ్యాఖ్యలు చేయడంలేదు. కానీ కోర్టు కొట్టేసిన నిబంధనలనే మళ్లీ పొందుపరిచి ప్రభుత్వం బిల్లు ఎందుకు తెచ్చిందన్న విషయం తెలుసుకోవడం తప్పనిసరి"
-- ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.వి. రమణ
బిల్లుపై పార్లమెంటులో చర్చ జరుగుతున్న సమయంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన వ్యాఖ్యలపై పత్రికల్లో వచ్చిన కథనాలను ప్రధాన న్యాయమూర్తి ఈ సందర్భంగా ప్రస్తావించారు. "గౌరవ మంత్రి ఒక మాట చెప్పారు. 'రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నాయన్న కారణంగా ఈ బిల్లులోని నిబంధనలను కోర్టు కొట్టి వేయలేదు కదా' అని అన్నారు. మనం ఈ బిల్లులతో ఏం చేయాలనుకుంటున్నాం? ట్రైబ్యునళ్లు పనిచేయాలనుకుంటున్నారా? లేదంటే మూసేయాలనుకుంటున్నారా?' అని ప్రశ్నించారు. బిల్లు తయారీ సమయంలో ఆర్థికశాఖ పొందుపరిచిన కారణాల ప్రకటన (స్టేట్‌మెంట్ ఆఫ్ రీజన్స్)ను కోర్టుకు చూపిస్తారా? అని జస్టిస్ రమణ సొలిసిటర్ జనరల్‌ను అడిగారు. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ ఈ కేసులో హాజరవుతారని, ఆయనను సంప్రదించడానికి సమయం కావాలని విజ్ఞప్తి చేశారు.
ఖాళీల భర్తీ ఎప్పుడు?
ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ట్రైబ్యునళ్లలో ఖాళీల గురించి సొలిసిటర్ జనరల్‌కు మరోసారి గుర్తుచేశారు. ట్రైబ్యునళ్లకు కార్యనిర్వాహక వ్యవస్థ ప్రభావం నుంచి విముక్తి కల్పించాలని గత ఏడాది మద్రాస్ బార్ అసోసియేషన్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులోని అంశాలను ఈ సందర్భంగా చదివి వినిపించారు. "కార్యనిర్వాహక వ్యవస్థ నియంత్రణ లేకుండా స్వతంత్రంగా పనిచేసినప్పుడే ట్రైబ్యునళ్లు సమర్థంగా పనిచేస్తాయి. దీనివల్ల వాటికి విశ్వసనీయత పెరగడంతోపాటు, ప్రజా విశ్వాసం పొందగలుగుతాయి. కోర్టు జారీచేసిన ఉత్తర్వులను ప్రభుత్వం అమలు చేయకపోవడంవంటి ఆందోళనకర పరిస్థితులను మేం గుర్తించాం." ఆ కేసులో కోర్టు వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు.
కోర్టు ఇచ్చిన తీర్పులను తుంగలో తొక్కుతూ చట్టాలు చేసే సంప్రదాయాన్ని కూడా తప్పుపట్టిందని గుర్తుచేశారు. దీనిపై అధికారికంగా స్పందించడానికి తమకు మరో పదిరోజుల సమయం ఇవ్వాలని కోరారు. అందుకు జస్టిస్ రమణ స్పందిస్తూ "గత విచారణ సమయంలోనే ఎన్ని ఖాళీలు ఉన్నదీ మీకు చెప్పాం. ఒకవేళ భర్తీ చేయాలనుకుంటే మిమ్మల్ని ఆపేవాళ్లెవ్వరూ లేరు" అని అన్నారు. సొలిసిటర్ జనరల్ మళ్లీ స్పందిస్తూ కోర్టు వ్యక్తం చేసిన అభిప్రాయాలను తాను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని తెలిపారు. వచ్చే పది రోజుల్లో దీనిపై చాలా పురోగతి కనిపించనుందని చెప్పారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్ నియామకాలు చేపట్టామని తెలిపారు.
కోర్టు వద్దన్న నిబంధనలు ఏమిటి?
ట్రైబ్యునళ్ల సంస్కరణల (హేతుబద్ధీకరణ, సర్వీసు నిబంధనలు) అత్యవసర ఆదేశాలు-2021ని సవాలు చేస్తూ మద్రాసు బార్ అసోసియేషన్ వ్యాజ్యం దాఖలు చేసింది. దీనిని న్యాయమూర్తులు జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు, జస్టిస్ ఎస్.రవీంద్ర భట్, జస్టిస్ హేమంత్ గుప్తాలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. దీంట్లోని కొన్ని నిబంధనలను కొట్టివేస్తూ 2:1 మెజార్టీతో తీర్పు ఇచ్చింది.
- ఈ ఆర్డినెన్స్ ప్రకారం ఛైర్‌పర్సన్, సభ్యుల పదవీ కాలాన్ని నాలుగేళ్లుగా నిర్ణయించారు. దీన్ని ధర్మాసనం తిరస్కరించింది. పదవీ కాలం తక్కువగా ఉంటే ప్రతిభావంతులు ఎవరూ ఈ పదవులను చేపట్టడానికి సుముఖత చూపరని, ఇది న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ప్రభావం చూపుతుందని అభిప్రాయపడింది.
- ఈ పదవులు చేపట్టడానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలని ఆర్డినెన్స్‌లో పేర్కొన్నారు. ఈ నిబంధన కారణంగా ఆదాయపు పన్నులు, తదితర ప్రత్యేక అంశాల్లో నైపుణ్యం సాధించిన యువ న్యాయవాదులకు అన్యాయం జరిగినట్టవుతుందని అభిప్రాయపడింది. కనీసం పదేళ్ల అనుభవం ఉన్న న్యాయవాదులకు ట్రైబ్యునల్ సభ్యులుగా అవకాశం ఇవ్వాలని సూచించింది.
- సభ్యుల ఎంపికకు సెర్చ్ కం సెలక్షన్ కమిటీని నియమించాలని, ప్రతి పదవికీ ఇద్దరి పేర్లను సిఫార్సు చేయాలని తెలిపింది. మూడు నెలల్లోగా నియామక ప్రక్రియను పూర్తి చేయాలని తెలిపింది.
- అయితే వీటిని కాదని ప్రభుత్వం పాత నిబంధనలతోనే చట్టాన్ని తీసుకొచ్చిందని, వీటిని కొట్టి వేయాలని కోరుతూ కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
ఎప్పుడూ అదే మాటా?
జస్టిస్ రమణ స్పందిస్తూ 'పురోగతిలో' అన్న మాటను కోర్టు దీర్ఘకాలంగా వింటూ వస్తోందని పెదవి విరిచారు. తాము ఎప్పుడు నియామకాల గురించి అడిగినా 'పురోగతి'లో ఉన్నాయని చెబుతూ వస్తున్నారని అన్నారు. ఆ మాటకు అర్థమే లేకుండాపోయిందని అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసారి పదిరోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు నియామకాలు చేపడతారని ఆశిస్తున్నామని పేర్కొన్నారు.
"నియామకాల ప్రక్రియ ప్రస్తుతం పురోగతిలో ఉన్నట్లు ప్రభుత్వం హామీ ఇచ్చింది. అందువల్ల ప్రభుత్వానికి పదిరోజుల సమయం ఇస్తున్నాం. ఈకేసు పెండింగ్‌లో ఉన్నంత మాత్రాన ట్రైబ్యునల్ నియామకాలకు అడ్డంకి కాబోదు" అని స్పష్టంచేస్తూ తదుపరి విచారణను పదిరోజులకు వాయిదా వేశారు.
ఛైర్మన్ లేరన్న కారణంగా జబల్‌పుర్ (మధ్యప్రదేశ్) డెట్ రివకరీ ట్రైబ్యునల్ పరిధిని లఖ్‌నవూ (ఉత్తర్‌ప్రదేశ్)కి బదిలీచేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీచేసిన నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ మధ్యపప్రదేశ్ రాష్ట్ర బార్ కౌన్సిల్ దాఖలు చేసిన కేసుపై విచారణ సందర్భంగా ఈ వాఖ్యలు చేసింది.
ఇదీ చదవండి: పెగసస్‌పై కేంద్రం అఫిడవిట్- ట్రైబ్యునళ్ల జాప్యంపై సుప్రీం అసహనం